మంకీపాక్స్‌పై రాష్ట్రం అలర్ట్
– గాంధీలో పరీక్షలకు సౌకర్యం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: దేశంలో కరోనాతో పాటు మంకీపాక్స్ కలవరం ముదిరిపోతోంది. దేశంలోకి చొరబడిన ఈ కొత్త వైరస్‌తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ప్రాణాంతకమైన వైరస్ కాకున్నా తీవ్రమైన అనారోగ్యం బారిన పడే అవకాశం ఉండడంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం ఆందోళన వ్యక్తంచేసింది. యూరప్ దేశాలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్న మంకీపాక్స్.. క్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల కేసులకుపైగా నమోదుకాగా, మహమ్మారికి నలుగురు బలయ్యారు. అప్రమత్తంగా ఉంటూ మహమ్మారిపై సంఘటితంగా పోరాడాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. కేరళలో తొలి మంకీపాక్స్ కేసు వెలుగుజూడడంతో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.
రాష్ట్రంలో మంకీపాక్స్ మహమ్మారి కోరలు చాచకముందే అణచివేసేందుకు వైద్యశాఖ భారీసంఖ్యలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మంకీపాక్స్ టెస్టులు చేసేందుకు సిద్ధమైంది. కిట్లు రావడమే ఆలస్యం ట్రయల్ రన్స్ ప్రారంభించేందుకు అన్నిఏర్పాట్లు పూర్తిచేసింది. పూణె వైరాలజీ ల్యాబ్ నుంచి ఇవాళ టెస్టింగ్ కిట్లను తెప్పిస్తోంది. కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టుల మాదిరిగానే మంకీపాక్స్ టెస్టులు చేయనున్నారు. బ్లడ్, స్వాబ్, స్కిన్‌పై ఉన్న నీటిబుడగల నుంచి శాంపిల్స్ సేకరించనున్నారు. మంకీపాక్స్ అనుమానితుల నుంచి శాంపిల్స్ తీసుకునేందుకు వైద్యశాఖ రెడీ అయ్యింది.
ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్తగా ఉండండి
అంతర్జాతీయ ప్రయాణికులు జ్వరం, జలుబు ఉన్న వాళ్లతో సన్నిహితంగా ఉండరాదని సూచించింది. ఎలుకలు, వన్యప్రాణులు, ఉడుతలు ఇతర జీవులకు దూరంగా ఉండాలని పేర్కొంది.



