రేషన్ కార్డులో చేంజేస్ ఈజీ..!
– మీసేవకు వెళ్లకుండా చేసుకునే ఛాన్స్
– కొత్త పేర్ల చేర్పు, పాతవి తొలగింపునకు అవకాశం
– ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రేషన్ కార్డులో తప్పులను సరిచేసుకునేందుకు, కుటుంబ సభ్యులను పేర్లను నమోదు చేసుకునేందుకు లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటి నుంచే సవరణ, కొత్త పేర్ల నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలుసా. అదికూడా ఆన్‌లైన్ సెంటర్లకు, మీసేవ కేంద్రాలకు వెళ్లకుండా చేసుకోవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ మేరా రేషన్ 2.0ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన యాప్‌లలో మేరా రేషన్ 2.0 కూడా ఒకటి. దీనిని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ముందున్న యాప్‌లో సమాచారంతో పాటు కొత్తగా ఇందులో తప్పుల సవరణ, కొత్త సభ్యుల నమోదును చేసుకునే అవకాశం కల్పించింది.

అంతేకాకుండా మొబైల్ నంబర్‌లను అప్‌డేట్ చేయడం, రేషన్ కార్డు స్థితిని తనిఖీ చేయడం, ఇ-కెవైసి ప్రక్రియను పూర్తి చేయడం, డిజిటల్ రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేయడం, ఆధార్‌తో రేషన్ కార్డును లింక్ చేయడం మొదలైన పనులను చేయవచ్చు.
ఎలా చేసుకోవాలంటే..?
యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత కుటుంబ పెద్ద ఆధార్ నెంబర్‌తో లాగిన్ అవ్వాలి. తరువాత కుటుంబ సభ్యుల వివరాలు కనిపిస్తాయి. అందులో పేర్లలో ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు. కొత్త సభ్యులను నమోదు చేసుకోవచ్చు. ఉన్న సభ్యులను తొలగింపు కూడా చేసుకోవచ్చు. చివరకు అప్‌డేట్ చేసే సమయంలో సంబంధిత పత్రాలను సమర్పిస్తే అధికారులు వాటిని పరిశీలించి ఆధునీకరణ చేస్తారు. దీంతో పాటు ఎలాంటి ఇబ్బందులకైనా మీరు ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు.


