ఇంకా.. మంత‌నాలే..!

తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

ఇంకా.. మంత‌నాలే..!
– కుర్చీ మార్పు ముందుకు
– దిగేందుకు స్వ‌ప్న ప‌రిమ‌ళ్ స‌సేమిరా
– ప‌ట్టు వీడ‌ని ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు
– తెర‌పైకి అవిశ్వాస మంత్రం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: నాలుగేండ్ల వ‌ర‌కు తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ కుర్చీ దిగేది లేద‌ని కొన్ని నెల‌ల క్రితం ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి చేసిన వాఖ్య‌ల‌తో స్థానికంగా ఒప్పంద రాజ‌కీయం వేడెక్కింది. చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వి విష‌యంలో చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్, వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలుల మ‌ద్య జ‌రిగిన రెండున్న‌రేళ్ల ఒప్పంద గ‌డ‌వు ద‌గ్గ‌ర‌ప‌డే కొద్దీ టీఆర్ఎస్ పార్టీలో అల‌జ‌డి కొన‌సాగుతూనే ఉంది. నిన్న‌టితో గ‌డువు తీర‌డంతో రాత్రి వ‌ర‌కు చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ చేత రాజీనామా చేయించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి ఆదేశిస్తేనే శిర‌సావ‌హిస్తామ‌ని చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ అప్ప‌టి నుంచి ప‌ట్టుమీద ఉన్నారు. ఎమ్మెల్సీ వ‌ర్గం కౌన్సిల‌ర్లు, నేత‌లు గ‌ట్టి మ‌ద్ద‌తు ల‌భించ‌డంతో ఆమె కుర్చీ దిగేందుకు స‌సేమిరా అంటున్నారు. మ‌రోవైపు చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌విని రాబ‌ట్టుకునేందుకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వ‌ర్గంతో దీపా న‌ర్సింలు ప‌ట్టుబిగిస్తూ వ‌స్తున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో క‌లిసి మంత్రి స‌బితారెడ్డి, శ్రీ‌నివాస్ యాద‌వ్, ఎంపీ రంజిత్ రెడ్డిల‌ను క‌లిసి రెండున్న‌రేళ్ల ఒప్పందాన్ని గుర్తుచేశారు.

అర్ద‌రాత్రి వ‌ర‌కు ఉత్కంఠ‌
స‌రిగ్గా బుధ‌వారంతో రెండున్న‌రేళ్ల ఒప్పంద గ‌డువు ముగిసింది. కుర్చీ దిగేందుకు చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ సానుకూలంగా లేక‌పోవ‌డంతో ఏం జ‌రుగుతుందో వేచి చూడాల‌ని అంద‌రు ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఒప్పందం ప్ర‌కారం చైర్ ప‌ర్స‌న్ చేత రాజీనామా చేయించాల‌ని ఎమ్మెల్యే వ‌ర్గం నేత‌లు హైద‌రాబాద్‌కు బ‌య‌లు దేరారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ద్వారా మంత్రి కేటీఆర్, మంత్రి శ్రీ‌నివాస్ యాద‌వ్, ఎంపీ రంజిత్ రెడ్డిల‌ను సంప్ర‌దించేందుకు ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లు తెలిసింది. మంత్రి కేటీఆర్ కాలుకు ఫ్యాక్చ‌ర్ కావ‌డంతో క‌లిసే అవ‌కాశం దొర‌క‌లేద‌ని ప్ర‌చారం సాగింది. మంత్రి శ్రీ‌నివాస్ యాద‌వ్ కూడ రెండు రోజులు వేచి చూద్దామ‌ని, ఎంపీ రంజిత్ రెడ్డి త‌న‌కు పార్ల‌మెంట్ స‌మావేశాలు ఉన్నాయ‌ని… ఖాళీ స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుందాని చెప్పిన‌ట్లు కూడ పుకార్లు వ‌చ్చాయి. కొన్నిరోజుల ముందే ఎమ్మెల్యే వ‌ర్గం నేత‌లు విష‌యాన్ని మంత్రి స‌బితారెడ్డి దృష్టికి తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే. మంత్రి స‌బితారెడ్డి చొర‌వ తీసుకుని ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డికి రాయ‌బారం పంపితే వ్య‌తిరేకించిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్రచారం జ‌రిగింది. అర్ద‌రాత్రి వ‌ర‌కు ఏమైనా జ‌ర‌గొచ్చ‌నే అంద‌రూ వేచిచూసే ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించారు. ఎటూ తేల‌క‌పోవ‌డంతో కుర్చీ మార్పు అంశం ముందుకు జ‌రిగింది.

తెర‌పైకి అవిశ్వాస మంత్రం
చైర్ ప‌ర్స‌న్ కుర్చి మార్పు విష‌యంలో ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి వ‌ర్గం నేత‌లు ఖ‌చ్ఛిత‌త్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ ప‌ద‌విని వ‌దుల‌కునే ప్ర‌స‌క్తే లేద‌ని బాహాటంగా పేర్కొంటున్నారు. రెండున్న‌రేళ్లు దాటినా కుర్చి వ‌ద‌లుకునేది లేద‌ని.. అస‌ర‌మైతే అవిశ్వాసం వ‌ర‌కు వెళ‌తామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. కొత్త మున్సిప‌ల్ చ‌ట్టం ప్ర‌కారం మూడేళ్లకు అవిశ్వాసం ఉంటుంద‌ని, ఆ లెక్క‌న ఇంకా ఆర్నేళ్ల దాక ప‌ద‌విని వ‌దులుకోమంటున్నారు. వ‌చ్చ యేడాది ఫిబ్ర‌వ‌రిలో అవిశ్వాసం పెట్టే వ‌ర‌కు త‌మ‌కు గ‌డువు ఉంటుందంటున్నారు. అవిశ్వాసం పెట్టినా మ‌ద్ద‌తు సాధించి నెగ్గితీరుతామ‌ని స‌వాల్ చేస్తున్నారు. కుర్చీ వ‌దులుకోవాల్సి వ‌స్తే చివ‌రి నిమిషంలో మూడో వ్య‌క్తికి అయినా ప‌దవిని క‌ట్ట‌బెట్టుంకు కృషి చేస్తామ‌ని పేర్కింటున్నారు.

కుల రాజ‌కీయ‌మే బెడిసి కొట్టిందా..?
ఏదేమైనా తాండూరులో మున్సిప‌ల్ ఒప్పంద రాజ‌కీయం జిల్లా నుంచి రాష్ట్రం వ‌ర‌కు చ‌ర్చ‌నీయాశంగా మారింద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. రెండున్న‌రేళ్ల ఒప్పందంపై ఎవ‌రికి వారు విశ్లేశ‌ణ ప్ర‌ద‌ర్శిస్తున్నారు. కుర్చి మార్పు విష‌యంలో విభిన్న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఒప్పంద గ‌డువు ముగిక‌ముందే ఎవ‌రి ఎత్తులు వారు ప్ర‌ద‌ర్శించ‌డం ప‌ట్ల వ్య‌తిరేక‌త‌ల‌ను ఎత్తి చూపుతున్నారు. కుర్చీని ద‌క్కించుకునేందుకు తెర‌పైకి కుల రాజ‌కీయాల‌ను తీసుక‌రావ‌డాన్ని చాలా మంది త‌ప్పుప‌డుతున్నారు. దీంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వ‌ర్గీయుల మ‌ద్య బెట్టు బిగిసింద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కుల రాజ‌కీయాలే బెడిసి కొట్టాయ‌ని చ‌ర్చించుకుంటున్నారు.