రేషన్‌కార్డు దారులకు కేంద్రం శుభవార్త
– మార్చి వరకు బియ్యం, గోధుమలు ఉచితం
దర్శిని ప్రతినిధి: దేశంలో రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్దిదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2020లో కేంద్రం ప్రారంభించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని మార్చి 2022 వరకు పొడిగించారు. కరోనా మహమ్మారి వల్ల పేదలు ఇబ్బంది పడకూడదని రేషన్‌కార్డుపై వారికి ఉచిత సరుకులు అందించారు. ప్రారంభంలో ఈ పథకం ఏప్రిల్-జూన్ 2020 వరకే ఉండేది. తర్వాత దీనిని నవంబర్ 30 వరకు పొడిగించారు. ఈ పథకాన్ని వచ్చే యేడాది మార్చి వరకు పొడగించడంతో ఈ పథకం కింద లబ్ధిదారులు మార్చి 2022 వరకు ఉచిత రేషన్ పొందుతారు.
ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మార్చి 2020లో ప్రారంభించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) గుర్తించబడిన 80 కోట్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఉచిత రేషన్‌ను అందిస్తుంది. నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలు (గోధుమ-బియ్యం) ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. రేషన్ కార్డ్ అందుబాటులో ఉన్న ప్రతి పౌరుడు తన కోటా రేషన్‌తో పాటు ఈ పథకం కింద ప్రతి నెలా 5 కిలోల అదనపు రేషన్‌ను తీసుకుంటున్నాడు.. అయితే రేషన్‌కార్డు లేనివారికి మాత్రం ఈ పథకం ప్రయోజనాలు అందవు.
పంపిణీ చేయకపోతే ఫిర్యాదు చేయవచ్చు
ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంతో అందరు లబ్ది పొందేలా కేంద్రం చర్యలు చేపట్టింది. రేషన్ కార్డ్ ఉంటే రేషన్ ఉన్నవారికి డీలర్లు ఈ పథకం కింద మీ కోటాకు ఆహారం పంపిణీ చేసేందుకు నిరాకరిస్తే మీరు టోల్ ఫ్రీ నంబర్‌లో ఫిర్యాదు చేయవచ్చు. జాతీయ ఆహార భద్రతా పోర్టల్ (NFSA)లో ప్రతి రాష్ట్రం కోసం టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి కాల్ చేయడం ద్వారా మీరు మీ ఫిర్యాదు చేయవచ్చు. ఇది కాకుండా మీరు NFSA వెబ్‌సైట్కి వెళ్లి మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని కేంద్రం తెలిపింది.

