శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్
– తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్
– మల్ రెడ్డిపల్లిలో నిర్భంద తనిఖీలు
– 108 వాహనాల స్వాధీనం, 10 సీజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : శాంతి భద్రతల పరిరక్షణ కోసమే పోలీసు శాఖ కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తుందని తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం తెల్లవారు జామున తాండూరు మున్సిపల్ పరిధి మల్ రెడ్డి పల్లి పరిధిలో తాండూరు పట్టణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్భంద తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ హాజరై తనిఖీలను పర్యవేక్షించారు. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, రూరల్ సీఐ రాంబాబులతో కలిసి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ పట్టణంలో పౌరుల భద్రత కోసం పోలీసుశాఖ కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తుందన్నారు. శాంతి భద్రతల కోసం నిర్వహించే ఈ తనిఖీలకు అందరు సహకరించాలన్నారు. అదేవిధంగా ప్రజలు, యువకులు రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు.

మరోవైపు తెల్లవారు జాము నుంచి నిర్వహించిన కార్డెన్ సెర్చ్ లో మల్ రెడ్డిపల్లిలోని 150 నివాసాలను తనిఖీలు నిర్వహించి 108 వాహనాలను స్వాదీనం చేసుకున్నట్లు డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. ఇందులో 93 బైకులు, 10 ఆటోలు, 5 ఇతర వాహనాలను ఉన్నట్లు వెల్లడించారు. 10 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. స్వాదీనం చేసుకున్న వాహనాలలో సరైన పత్రాలను పరిశీలించి విడిచి పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణంతో పాటు కరణ్ కోట్, యాలాల పోలీస్టేషన్ల ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.



