ప్రజా సంక్షేమం కోస‌మే పీపుల్ ప్రోటక్షన్ పార్టీ

తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

ప్రజా సంక్షేమం కోస‌మే పీపుల్ ప్రోటక్షన్ పార్టీ
– ప్ర‌జా సేవ‌కోస‌మే ఉద్యోగానికి విర‌మ‌ణ
– తెలంగాణ‌లో త్వరలోనే కమిటీల నియామకం
– పీపీపీ వ్య‌వ‌స్థాప‌కులు వి.సదానంద రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: ప్రజా సంక్షేమం కోస‌మే పీపుల్ ప్రోటక్షన్ పార్టీ(పీపీపీ) స్థానించిప‌ట్లు పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ఏఎస్పీ వి.సదానందరెడ్డి పేర్కొన్నారు. పోలీసు శాఖలో 1991లో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఆయన అడిషనల్ ఎస్పీ స్థాయికి ఎదిగారు. భూపాలపల్లిలజిల్లాలో విధులు నిర్వహిస్తూ ఇంకా ఆరేళ్ల సర్వీసు ఉండగానే వీఆర్ఎస్ తీసుకున్నారు. ప్రజా సేవ కోసం పీపుల్ ప్రోటక్షన్ పార్టీ స్థాపించారు. బుధవారం వికారాబాద్ జిల్లాలోని తెలంగాణ – కర్ణాటక రాష్ట్రాల రాష్ట్ర సరిహద్దులోని కొత్లాపూర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో వ్యవస్థాపకులు సదానంద రెడ్డి అమ్మవారికి పూజలు నిర్వహించి పార్టీని, ఏజెండాను ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పీపుల్ ప్రోటక్షన్ పార్టీ సమాజ సంక్షేమం, పేదలకు అన్నిరంగాల్లో న్యాయం, భద్రత కల్పించడంలో కీలకంగా ఉంటుందన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు స్వార్థం కోసమే మోసపూరితంగా కొనసాగుతున్నాయన్నారు. పీపుల్ ప్రోటక్షన్ పార్టీ ద్వారా అందరికి ఉచిత విద్య, వైద్యం, ధరల నియంత్రణకు కృషి చేయడం జరుగుతుందన్నారు. అవినీతి పాలన, అసమానతలనినిర్మూలన కోసం పాటుపడడం జరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ, కార్మికులు, ప్రజల భద్రతకు దృష్టిసారిస్తుందన్నారు.

దీంతో పాటు సమాజరక్షణ, ప్రజా సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రజా సేవ కోసమే పార్టీని స్థాపించడం జరిగిందని, అవసరమైతే ప్రాణాలను త్యాగం చేసేందుకు కూడ సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పీపుల్ ప్రోటక్షన్ పార్టీని ఆదరించాలన్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పీపీపీ కమిటీలను నియమిస్తామని పేర్కొన్నారు. అనంతరం కొత్లాపూర్, కోటబాస్పల్లి, ఐనెల్లి తదితర గ్రామాల్లో పార్టీపై ఆటో ర్యాలీ ద్వారా ప్రచారం నిర్వహించారు.