గుట్ట‌ల్లా.. రేష‌న్ బియ్యం బ‌స్తాలు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

గుట్ట‌ల్లా.. రేష‌న్ బియ్యం బ‌స్తాలు
– క‌న్నుగ‌ప్పి క‌ర్ణాట‌కకు త‌ర‌లింపు య‌త్నం
– క‌ళ్లెం వేసి ప‌ట్టుకున్న‌ టాస్క్ ఫోర్స్ పోలీసులు
– 150 క్వింటాళ్ల నిల్వ బియ్యం సీజ్, పోలీసుల‌కు అప్ప‌గింత‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప్ర‌భుత్వ రేష‌న్ బియ్యం ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా స‌ర్కారు ఎన్ని క‌ట్ట‌డి చ‌ర్య‌లు చేప‌ట్టినా అక్ర‌మార్కులు త‌మ పంథాల‌ను వీడ‌డం లేదు. రాజ‌కీయ నాయ‌కుల అండ‌దండ‌ల‌తో అక్ర‌మ దందాల‌ను కొన‌సాగిస్తున్నారు. స‌రిగ్గా అలాంటి ముసుగులో దందా కొన‌సాగిస్తున్న‌ ఓ యువ నాయ‌కుడి గుట్టు టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల‌లో ర‌ట్టు అయ్యింది. ఓ ప్ర‌దేశంలో గుట్ట‌ల్లాగా పేర్చిన రేష‌న్ బియ్యం బ‌స్తాల‌ను క‌ర్ణాట‌కు త‌ర‌లిస్తుండ‌గా క‌ళ్లెం వేశారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూరులో టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం భారీగా రేష‌న్ బియ్యం త‌ర‌లిస్తున్న డీసీఎంను ప‌ట్టుకుని స్థానిక పోలీసుల‌కు అప్ప‌గించారు. వివ‌రాల్లోకి వెళితే తాండూరు ప‌ట్ట‌ణానికి  ఓ యువ‌నాయ‌కుడు ఓ రాజ‌కీయ పార్టీలో చురుకుగా ప‌నిచేస్తున్నాడు. అయితే తాండూరు ప‌ట్ట‌ణం నెహ్రు గంజ్ స‌మీపంలోని వారి స్థ‌లంలో కొన్నాళ్ల నుంచి ప్ర‌భుత్వ రేష‌న్ బియ్యాన్ని పెద్ద ఎత్తున నిల్వ ఉంచాడు. గుట్ట‌ల్లాగా పేర్చిన బియ్యం బ‌స్తాల‌ను గురువారం అంద‌రి క‌న్నుగ‌ప్పి క‌ర్ణాట‌కకు త‌ర‌లించేందుకు నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలో రేష‌న్ బియ్యాన్ని టీఎస్12 యూసీ 6818 నెంబ‌రు గ‌ల డీసీఎంలో త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అప్ప‌టికే విశ్వ‌స‌నీయ స‌మాచారం అందుకున్న వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ వెంక‌టేశం, ఎస్ఐ ప్ర‌శాంత్ వ‌ర్ద‌న్‌ల బృందం దాడులు నిర్వ‌హించి అడ్డుకుంది. ఈ దాడుల్లో యువ‌నాయ‌కుడు అక్ర‌మంగా నిల్వ ఉంచిన 300 బ‌స్తాల‌ను గుర్తించారు. ఈ బియ్యం దాదాపు 150 క్వింటాళ్ల వ‌ర‌కు ఉండొచ్చ‌ని నిర్దారించారు. వెంట‌నే దాడుల ప‌ర్వం ముగించి ప‌ట్టుబ‌డిన రేష‌న్ బియ్యం డీసీఎంను ప‌ట్ట‌ణ పోలీసుల‌కు అప్ప‌గించారు. పెద్ద మొత్తంలో రేష‌న్ బియ్యం ప‌ట్టుబ‌డ‌డంతో ఈ సంఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేప‌డంతో పాటు ఇందుకు పాల్ప‌డింది ఓ యువ‌నాయ‌కుడు కావ‌డంతో రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.