లెక్క‌లు తేలిస్తేనే నిధులు

జాతీయం తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

లెక్క‌లు తేలిస్తేనే నిధులు
– ప‌ల్లె ప్ర‌గ‌తి నిధుల‌పై కేంద్రం ఉత్త‌ర్వులు
– సీఎం స‌ర్కారుకు ఢిల్లీ స‌ర్కారు దెబ్బ‌
ద‌ర్శిని డెస్క్ : కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి అందించే నిధుల‌లో స్ప‌ష్ట‌త‌త‌ను కోరుతోంది. మంజూరు చేసిన నిధుల‌కు లెక్క‌లు స‌రిచూపిస్తేనే పెండింగ్ నిధులు మంజూరు చేస్తామ‌నే ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తోంది. కేంద్ర నిధులతో పనులు చేస్తున్నా.. ఒక్కచోట కూడా కేంద్ర ప్రభుత్వానికి పేరు రాకుండా చేస్తున్నారని కేంద్రం నిబంధనలను మార్చింది. ఇప్ప‌టికే ఉపాధి నిధులపైనా రాష్ట్రానికి ఉండే అధికారాలలో కోత విధించిన విష‌యం తెలిసిందే. తాజాగా పల్లె ప్రగతి నిధులపైనా కేంద్రం దృష్టి పెట్టింది. మూడేండ్లలో కేంద్రం విడుదల చేసిన నిధులు, వాటికి సంబంధించిన వినియోగపు ధృవీకరణ పత్రాలపై రాష్ట్రానికి నోటీసులు జారీ చేసింది. కేంద్రం నుంచి నిధులు ఇచ్చినా.. సంబంధిత పనులకు ఇంకా బిల్లులు చెల్లించడం లేదని కేంద్ర బృందం ఇటీవల గుర్తించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా పల్లె ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందుకోసం భారీగా నిధులను ఖ‌ర్చుచేస్తోంది. కానీ, ఇందులో సెంట్రల్​షేర్​కూడా ఉన్నట్లు తేలింది. పల్లె ప్రగతి కింద 20‌‌19–20 నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరం వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5124.95 కోట్లు ఖర్చు చేసింది. ఈ మూడేండ్ల కాలానికి కేంద్రం నుంచి రూ. 3813.01 కోట్లు విడుదల చేసినట్లు సెంట్రల్​ వెల్లడించింది. కేంద్రం నుంచి ఇచ్చిన నిధులను పెండింగ్​ పెట్టినట్లుగా గుర్తించారు. రూ. 3813 కోట్లు విడుదల చేసినా వాటిని పంచాయతీలకు ఇవ్వలేదని కేంద్ర బృందం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం మూడేండ్ల కాలానికి పల్లె ప్రగతి కింద విడుదల చేసిన నిధులపై పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కేంద్రం గ్రామీణాభివృద్ధి శాఖకు సూచించింది. యూసీలు, అడిట్​రిపోర్టులు ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ స‌ర్కారుకు ఢిల్లీ స‌ర్కారు గ‌ట్టి దెబ్బ తీస్తుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.