పేదలకు అండగా సీఎం కేసీఆర్
– అసరాతో ఆర్థిక భరోసా
– బీజేపీ చేసిందేమి లేదు
– తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
– తాండూరులో అసరా లబ్దిదారులకు కార్డుల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదలకు అండగా నిలుస్తున్నారని, అసరా పథకంతో ఆర్థిక భరోసా అందిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో తులసీ గార్డన్‌లో ఏర్పాటు చేసిన అసరా ఫించన్ కార్డుల పంపీణీకి మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నేతలతోకలిసి లబ్ధిదారులకు కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అసరా పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళ, నేతన్న, బోధకాలు బాధితులు, డయాలసిస్ బాధితులలకు అసరా పథకాన్ని అమలు చేస్తూ గొప్ప మానవతావాదిగా నిలుస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కొత్తగా 57 ఏండ్ల వారితో పాటు ఇతర విభాగాలకు చెందిన 10 లక్షల మందికి అసరా పథకాన్ని పత్రోత్సవ కానుకగా అందజేశారని తెలిపారు. దీంతో జిల్లాలో 25వేల మందికి అసరా అందుతుండగా తాండూరులో 8వేల మంది కొత్తగా ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. కొడుకులు, కోడళ్లకు భారం కావద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అందరికి అసరా అందిస్తూ ఇంటి పెద్ద కొడుకుగా నిలుస్తున్నారని అన్నారు. అసరా పథకంతో పేదల ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ పెంచారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకం కోసం రూ. 12 వేల కోట్లను ఖర్చు చేస్తుందన్నారు. ఇందులో బీజేపీ ఇచ్చేది కేవలం రూ. 200 కోట్లు మాత్రమే అని విమర్శించారు. డబుల్ ఇంజన్ సర్కారుగా గొప్పలు పోతున్న బీజేపీ పాలిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆసరా, కళ్యాణలక్ష్మి, షాదీ ముభారక్, రైతుబంధు, రైతు బీమా వంటివి ఎక్కడా అమలు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదాలే సీఎం కేసీఆర్ కు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. అందరి దీవెనలు కేసీఆర్ కు అందించాలన్నారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగానే పారిశ్రామిక వాడ, కొత్త మార్కెట్, ఆటో నగర్, రైల్వే వంతెన వంటి ప్రాజెక్టులను సాధించారని అన్నారు. తాండూరు రూపురేఖలు మార్చేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సస్ పట్లోళ్ల దీపా నర్సింలు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్, ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ వైస్ చైర్ పర్సస్ పట్లోళ్ల రత్నామాల, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, విజయదేవి, మంకాల రాఘవేందర్, సల్మా పాతిమా, సంగీత ఠాకూర్, వసంత, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


