కామన్ మ్యాన్‌కు కోపమొచ్చింది..!
– చెప్పుల దండ మెడలో వేసుకుని నిరసన
– తాండూరు ఎమ్మెల్యే తీరుపై దీక్ష చేసిన వ్యక్తి
– చెప్పుతో కొట్టి.. దిష్టి బొమ్మలను దహనం చేయాలని విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల్లో ఇచ్చిన హామిలను నెరవేర్చలేదని ఓ కామన్ మ్యాన్ ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. తనను అడ్డమైన తిట్టి.. శాపనార్థాలు పెట్టి.. ఊరూర నా దిష్టి బొమ్మలను తగుల పెట్టాలని.. చెప్పుల దండ మెడలో వేసి అవమానించాలని దీక్ష ద్వారా ప్రజలను విజ్ఞప్తి చేశాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన రిజ్వాన్ అనే వ్యక్తి ఈ నిరసన చేపట్టాడు.
గత ఎన్నికల్లో తాండూరు అభివృద్ధి చేస్తానని.. రోడ్ల దుస్థితిని మారుస్తానని.. కాలుష్యాన్ని నివారిస్తానని హామి ఇవ్వడంతో నమ్మి ఎన్నికల్లో ఓటేశానని చెప్పుకొచ్చాడు రిజ్వాన్. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే ఇచ్చిన హామిలు విస్మరించారని ఆరోపించాడు. ప్రస్తుతం అధ్వాన్నంగా మారిన దుస్థితికి నేనే కారనణమని.. దుమ్ము, కాలుష్యానికి.. ప్రజల ఇబ్బందులకు ఓ ఓటరుగా నేనే కారణమంటూ.. నన్ను అస్సలు క్షమించొద్దంటూ ఫ్లేక్సీ ఏర్పాటు చేసి మరీ నిరసన చేపట్టాడు. ఇది చూసిన జనాలందరు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రజా ప్రతినిధులు చేయని పనిని ఓ ఓటరు రిజ్వాన్ చేసిన పనిని ప్రశంసిస్తూ అభినందించారు.
