వినాయకా.. సెలవికా..!
– శోభాయామానంగా నిమజ్జన వేడుక
– స్వాగతం పలికిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
– బందోబస్తును పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: గణపతి బస్పా మోరియా.. ఆదా లడ్డూ కాలియా.. జై బోలో గణేశ్ మహారాజ్‌కీ జై.. అంటూ నినాదాలు తాండూరులో మారుమోగాయి. ఆదివారం పట్టణంలో గణనాథుడి నిమజ్జనోత్సవం కనులపండువగా సాగింది. యువతీయువకుల కేరింతలు, డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు.. శోభాయాత్ర ఆకట్టుకున్నాయి. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మద్యాహ్నం తరువాత నిమజ్జన వేడుకలు ప్రారంభమయ్యాయి. బ్యాండు మేళాలు, తాషా వంటి వాటితో యువకులు, మండళ్ల సభ్యు లు నృత్యాలు చేశారు. కేరింతలు కొడుతూ హుషారుగా క నిపించారు. యువత నృత్యాలు చేస్తూ సెల్ఫీల్లో బంధిస్తూ ఆనందంగా గడిపారు. పలువురు పులిహోర, ఉప్మాను పంపిణీ చేశారు.
స్వాగతం పలికిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
వినాయక నిమజ్జన వేడుకలలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలు పాల్పంచుకున్నారు. పట్టణంలోని భద్రేశ్వర చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేధిక పైనుంచి నిమజ్జనానికి తరలే గణనాథులకు స్వాగతం కలిపి సాగనంపారు. హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషనర్ మెంబర్ శుభప్రద్ పటేల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, సీనీయర్ నాయకులు, కౌన్సిలర్లు, భక్తులు పాల్గొన్నారు.
బందోబస్తును పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి

పట్టణంలో నిర్వహించిన గణేశ్ నిమజ్జనానికి వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి కూడ హాజరయ్యారు. జిల్లా అడిషనల్ ఎస్పీ రసీద్, తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ పర్యవేక్షణలో ముగ్గురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 30 మంది ఎస్ఐలతో కూడిన 450 మంది పోలీసులను మోహరించారు. వినాయకులు శోభాయాత్రలో ఎక్కడి వరకు చేరుకున్నాయి? నిమజ్జనం ఎలా జరుగుతుంది? వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు.


