ప్రశంసల వైద్యంపై విమర్శలా..!
– తెలంగాణ వైద్య సేవలకు కేంద్రం అందలం
– కేంద్రం ఏయిమ్స్ ఆసుపత్రి సేవలు దైన్యం
– ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు సీఎం ఘనతే
– మనోభావాలు దెబ్బతీయడం గవర్నర్ కు తగదు
– తమిళిసైపై ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మండిపాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశంలో ప్రశంసలు పొందేవిధంగా వైద్య సేవలు అందించే తెలంగాణ రాష్ట్ర వైద్య రంగంపై గవర్నర్ తమిళిసై విమర్శలు చేయడం తగదని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ధ్వజమెత్తారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశ వర్కర్లు, ఎఎన్ఎంలకు కొత్త చీరల పంపిణీ కార్యక్రమాన్ని తాండూరు నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని నేషనల్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఆశల సమ్మేళనం వేధికపై మంత్రి హరీష్ రావు ప్రసగించారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్యరంగం బాగాలేదని, వైద్య సేవలు దయనీయంగా ఉన్నాయని గవర్నర్ తమిళిపై వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. గవర్నర్ హోదాలో వైద్యురాలు అయి ఉండి కూడ వైద్యులు, వైద్య సిబ్బంది సేవలపై విమర్శలు చేయడం దురుదృష్టకరమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల కంటే తెలంగాణ రాష్ట్రం వైద్య సేవల్లో అగ్రస్థానంలో ఉందన్నారు. కేరళ, తమిళనాడులు ముందు వరుసలో ఉంటే తెలంగాణ తరువాతి స్థానంలో ఉందని పేర్కొన్నారు. మాతా శిశు మరణాల నివారణలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని కేంద్రం ప్రశంసించిందని గుర్తుచేశారు. మెరుగైన వైద్య సేవలకు గాను కేంద్రం అవార్డులు అందిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ దాదాపు రూ. 500 కోట్లతో వైద్యరంగాన్ని మెరుగు పరిచారని అన్నారు. అన్ని ఆసుపత్రులలో లేబర్ రూంలు, ఆపరేషన్ థియేటర్లు, వసతులు, కల్పించడమే కాకుండా కేసీఆర్ కిట్ ను ప్రవేశ పెట్టి ప్రసవాలను పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగుతున్న బీబీ నగర్ ఏయిమ్స్ ఆసుపత్రిలో సరైన వసతులు లేవని, నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు. అందులో ఒక్క రోగి లేదని, ఒక్క ప్రసవం కూడ జరగడంలేదని, రక్తనిధి కేంద్రం కూడ లేదని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఆదిలాబాద్, సిద్ధిపేట్ తదితర జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ఏవిధంగా పనిచేస్తున్నాయో పరిశీలించాలని సవాల్ చేశారు. దేశం గర్వించదగ్గ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, ఏఎన్ఎం, ఆశ వర్కర్ల మనోభావాలు దెబ్బతీసేలా గవర్నర్ తమిళిపై వాఖ్యలు చేయడం ఆమెకు తగునా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. మరోవైపు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధమైన గవర్నర్ హోదాలో ఉన్న తమిళిపై రాజకీయాలు చేయడం పద్దతి కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ తరహ పాత్రను పోషించడం మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాతా శిశు సంక్షేమ శాఖ అధికారి శ్వేతా కమిటీ మహంతి, జిల్లా పరిషత్ చైర్ పర్సస్ పట్నం సునితా మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ పట్లోళ్ల దీపా నర్సింలు, టీఆర్ఎఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూప్, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, విజయదేవి, మంకాల రాఘవేందర్, రాము, వెంకన్న గౌడ్, బోయరవిరాజు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, పట్లోళ్ల నర్సింలు, నేతలు సాయిపూర్ బాల్ రెడ్డి, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


