ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో గంజాయి విక్ర‌యం

క్రైం తాండూరు వికారాబాద్

ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో గంజాయి విక్ర‌యం
– ఫుట్‌పాత్ వ్యాపారిని ప‌ట్టుకున్న పోలీసులు
– కేసు న‌మోదు, రిమాండుకు త‌ర‌లింపు
– వికారాబాద్ ప‌ట్ట‌ణంలో వెలుగులోకి
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: పుట్‌పాత్‌పై వ్యాపారం చేసుకునే యువ వ్యాపారి అడ్డ‌దారిలో డ‌బ్బులు సంపాదించేందుకు తెగ‌బ‌డ్డాడు. ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌లో గంజాయి విక్ర‌యాల్ప‌కు పాల్ప‌డ‌డంతో జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అత‌ని ఆట క‌ట్టించ‌డంతో క‌ట‌క‌టాల పాల‌య్యాడు. బుధ‌వారం వికారాబాద్ ప‌ట్ట‌ణంలో ఈ సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. వికారాబాద్ టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ వెంక‌టేశం, వికారాబాద్ సీఐ శ్రీ‌నులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం వికారాబాద్ ప‌ట్ట‌ణం గ‌రీబ్ న‌గ‌ర్ కాల‌నీకి చెందిన ఇప్ప‌ల‌ప‌ల్లి వినోద్ కుమార్ అలియాస్ ల‌డ్డు(26) పుట్‌పాత్ వ్యాపారం చేసేవాడు. దీంతో పాటు బీద‌ర్ ప్రాంతం నుంచి గుట్టుగా గంజాయి తీసుక‌వ‌చ్చి విక్ర‌యాల‌కు పాల్ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం సాయంత్రం గ‌రీబ్ న‌గ‌ర్ కాల‌నీ ప్ర‌భుత్వ పాఠ‌శాల ప్ర‌హారం వద్ద ఒక ప్లాస్టిక్ క‌వ‌ర్లో గంజాయి ఉంచి విక్ర‌యిస్తుండ‌గా జిల్లా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ వెంక‌టేశం ఆధ్వ‌ర్యంలో దాడులు నిర్వ‌హించి ల‌డ్డును అదుపులోకి తీసుకున్నారు. బుధ‌వారం వికారాబాద్ త‌హ‌సీల్దార్ స‌మ‌క్షంలో పంచ‌నామ నిర్వ‌హించి గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. ఈ మేర‌కు ల‌డ్డుపై కేసు న‌మోదు చేసి రిమాండుకు త‌ర‌లించారు. మ‌రోవైపు వికారాబాద్ సీఐ శ్రీ‌ను మాట్లాడుతూ నిషేదిత గంజాయిపై తెలంగాణ పోలీసు శాఖ‌ ఉక్కు పాదం మోపుతుంద‌ని, ఇందులో భాగంగా వికారాబాద్‌లో ఎవ‌రైనా గంజాయి విక్ర‌యాల‌కు పాల్ప‌డితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.