ఏడాదికి రూ. 20 డిపాజిట్ చేస్తే రూ. 2లక్షల బీమా

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

ఏడాదికి రూ. 20 డిపాజిట్ చేస్తే రూ. 2లక్షల బీమా
– పీఎం సురక్ష బీమా యోజనతో పేదలకు లబ్ది
దర్శిని డెస్క్: ఉరుకుల పరుగుల జీవితంలో ఎవ్వరికి ఎప్పుడు ఏం జరుగుతుందో.. తెలియని పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలు బీమా పథకాలను నమోదు చేయించుకుంటారు. పెద్దలు, మద్య తరగతి ప్రజల సంగతి ఎలా ఉన్నా.. నిరుపేదలకు బీమా కష్టమే. అందుకే కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ప్రీమియంతో ఎన్నో బీమా పథకాలను అందిస్తోంది. వీటిలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్ బివై) ఒకటి. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద చేరే వ్యక్తి ఏడాదికి రూ. 20 డిపాజిట్ చేయడం ద్వారా రూ. 2 లక్షల వరకు బీమా ప్రయోజనాలను పొందవచ్చు.

ఎల నమోదు చేసుకోవాలంటే..
ఈపథకంలో చేరే వ్యక్తులు బ్యాంకులో సేవింగ్ ఖాతా కలిగి ఉండాలి. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అధికారిక వెబ్ సైట్ లేదా ఇక్కడ లింక్ క్లిక్ చేయడం ద్వారా నేరుగా వెబ్ సైట్ ని సందర్శించి ఈపథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారం పొందవచ్చు. అప్లికేషన్ లో పొందుపర్చిన వివరాలు పూర్తిచేసి, అవసరమైన డాక్యుమెంట్ల నకలు జతపరచి బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది. ఈపథకం కోసం అకౌంట్ లోనుంచి రూ.20 తీసుకుంటారు.

అర్హతలు ఇవే
18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఈపథకానికి అర్హులు. ఈపథకంలో లబ్ధిదారులు ఎవరైనా రోడ్డు ప్రమాదంలో మరణిస్తే మృతుడి కుటుంబ సభ్యులకు రూ.2,00,000 ఆర్థిక సాయం పొందొచ్చు. ఒకవేళ ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.లక్ష ఆర్థిక సాయం లభిస్తుంది. బ్యాంకులో పొదుపు ఖాతా ఉన్న వారు ఈపథకంలో చేరొచ్చు.

బీమా కోసం ఇలా చేయాలి
ఈపథకంలో చేరిన లబ్ధిదారుడు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే ఆ వ్యక్తి యొక్క నామినీ బ్యాంకు, బీమా కార్యాలయానికి వెళ్లి క్లెయిమ్ ఫారమ్‌ను పూర్తిచేయాలి. బీమా చేయబడిన వ్యక్తి తన పొదుపు ఖాతాను కలిగి ఉన్న బ్యాంకు శాఖలో బీమా చేయబడిన వ్యక్తి మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించవలసి ఉంటుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత, బీమా కవర్ మొత్తం నామినీ ఖాతాలోకి బదిలీ అవుతుంది.