విద్యుత్ మరమ్మత్తులో విషాదం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యుత్ మరమ్మత్తులో విషాదం
– ట్రాన్స్‌ఫార్మర్‌ రిపేర్ చేస్తుండగా ఎలక్ట్రీషన్‌కు షాక్
– ఆసుపత్రిలో తరలించగానే మృతి
– తాండూరు మండలం జినుగుర్తిలో ఘటన
– కుప్ప కూలిన విద్యుత్ ఏఈ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : విద్యుత్ ట్రాన్స్‌ ఫార్మర్‌కు మరమ్మత్తులు చేస్తుండగా విషాధం చోటు చేసుకుంది. రిపేర్‌ చేస్తున్న ఎలక్ట్రీషన్‌కు షాక్‌ తగిలి పడిపోయాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించిన నిమిషాల్లోనే కన్నుమూశారు. ఈ సంఘటన తాండూరు మండలం జినుగుర్తిలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్కటూర్ గ్రామానికి చెందిన చాంద్ పాష(60) విద్యుత్ షాక్లో ఆర్టిజెన్ కార్మికుడుగా పనిచేస్తున్నారు. ఇటీవలే ఆయనకు ఉద్యోగం రెగ్యూలర్ అయినట్లు తెలిసింది. చాంద్ పాష మండలంలోని జినుగుర్తి గ్రామంలో ఎలక్ట్రీషన్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల గ్రామ సమీపంలోని సోలార్ పక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ మరమ్మత్తులకు గురికావడంతో గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు మంగళవారం సాయంత్రం చాంద్ పాష కోటబాస్పల్లి సబ్ స్టేషన్ నుంచి ఎల్ సీ తీసుకుని మరమ్మత్తులు’ చేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో మరోకరు కూడ ఎల్ సీ తీసుకున్నారు. చాంద్ పాష, ఆపరేటర్‌ల మద్య సమన్వయం లేకపోవడంతో ఆపరేటర్ ఎల్ సీని తొలగించాడు. దీంతో జినుగుర్తిలో మరమ్మత్తులు చేస్తున్న చాంద్ పాష షాక్ కు గురై పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన విషయాన్ని విద్యుత్ రూరల్ ఏఈ వెంకన్నకు సమాచారం అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చాంద్ పాష మృతి చెందాడు. ఆ తరువాత ఆసుపత్రికి వచ్చిన ఏఈ చాంద్ పాష మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. గమనించిన సిబ్బంది ఆయన్ను పట్టణంలోని బాలాజీ ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ షాక్‌తో మృతి చెందిన చాంద్ పాషకు తోటి ఉద్యోగులు, గ్రామస్తులతో మంచి సంబంధాలు ఉండడంతో ఆయన మరణవార్త తెలుసుకుని జిల్లా ఆసుపత్రికి భారీగా తరలివచ్చారు. కోటబాస్పల్లి గ్రామ సర్పంచ్ మదన్మోహన్ కూడ ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. చాంద్ పాషకు భార్య, కుమారులు ఉన్నారు.