పీఆర్సీ మాకెందుకు ఇవ్వరు..!
– పెంచిన వేతనాలు వెంటనే చెల్లించాలి
– సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: పీఆర్సీ మాకెందుకు అమలు చేయరని తాండూరు మున్సిపల్ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. 11వ పీఆర్సీ కింద పెంచిన వేతనాలను చెల్లించాలని కార్మికులు సమ్మెకు దిగారు. శనివారం ఏఐయూటీయూసీ మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు సమ్మె చేపట్టారు. మున్సిపల్‌లో పనిచేస్తున్న 215 మంది కార్మికులతో పాటు వేతన ఇబ్బందులు పడుతున్న 18 మంది కార్మికులు సమ్మెలో బైటాయించారు. పెంచిన వేతనాలు చెల్లించాలని, పీఆర్సీని అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం 11 వ పీఆర్సీ కింద పెంచిన జీతాలను 16 నెలలుగా అమలు చేయడం లేదన్నారు. ఇతర మున్సిపాల్టీలలో అమలవుతున్నా.. మాకెందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గతంలో ఇదే విషయంపై సమ్మె చేస్తే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామి ఇచ్చి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కార్మికులకు పెంచిన వేతనాలను, పీఆర్సీని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.

