విద్యార్థులను మింగిన చెరువు
– ఈత రాక ఐదుగురి మృతి
– కాపాడేందుకు వెళ్లిన ఉపాధ్యాయుడు కూడ
– మేడ్చల్ జిల్లాలో పెను విషాదం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఈత కోసం చెరువులో దిగిన ఐదుగురు విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. వారిని కాపాడేందుకు వెళ్లిన ఉపాధ్యాయుడు కూడ మృతి చెందాడు. పెను విషాధం నింపిన ఈ సంఘటన మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పీఎస్ పరిధిలో జరిగింది. కాచిగూడ అడ్జి కార్ఖానాలోని మదర్సాకు చెందిన ఇస్మాయిల్, జాఫర్, సోహేల్, అయాన్, రియాన్.. విద్యార్థులు, మదర్సా ఉపాధ్యాయులు యోహాన్‌లు జవహర్‌నగర్ పీఎస్ పరిధిలోని మల్కాపురం ఎర్రగుంట చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ విద్యార్థులు చెరవులో ఈత కోసం దిగగా నీట మునిగిపోయారు. గమనించిన ఉపాధ్యాయులు యోహాన్ వారిని కాపాడేందుకు చెరువులో దూకారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుడు కూడ చెరువులో మునిగిపోయారు. స్థానికుల సమాచారం ద్వారా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో గాలించారు. ఐదుగురు విద్యార్థులు, మరో వ్యక్తి మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

