గ్రంథాలయాల పురోగతికి కృషి

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

గ్రంథాలయాల పురోగతికి కృషి
– త్వరలోనే లైబ్రరీలకు కొత్త భవనాలు
– పాఠకుల ఉపయోగార్థం మెరుగైన సేవలు
– జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్
– ఘనంగా వారోత్సవాల ప్రారంభం
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: జిల్లాలోని అన్ని గ్రంథాలయాల పురోగతికి కృషి చేయడం జరుగుతుందని వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. సోమవారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో 56వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమానికి చైర్మన్ రాజుగౌడ్ హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం సహాకారంతో జిల్లాలోని గ్రంథాలయాలను పురోగతి పరిచేందుకు దృష్టిసారిస్తున్నామన్నారు. ఇప్పటికే తాండూరులోని 1.35 కోట్లతో కొత్త భవనానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అదేవిధంగా దౌల్తాబాద్‌లో రూ. 63లక్షలు, కోడంగల్‌లో రూ. 50 లక్షలతో కొత్త భవనాలను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. వికారాబాద్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయంను కూడ ఆధునీకరించేందుకు ప్రాధాన్యమివ్వడం జరుగుతుందన్నారు. దీంతో పాటు పాఠకులకు, పోటీ పరీక్షలకు సిద్దపడే యువతకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులోకి తీసుకవస్తామని, పాఠకులకు ఉపయోగకరమైన మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయాల్లో రంగోలితో పాటు వివిధ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, దీంతో పాటు 20వ తేదిన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో నిర్వహించే వేడుకకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే డా.ఆనంద్, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కోడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. చివరగా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పాఠకులకు, విద్యార్థులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పలువురు విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విజయ్ కుమార్,టీఆర్ఎస్ వికారాబాద్‌ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్‌ రెడ్డి, తాండూరు పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), తాండూరు మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.