కమలంతో కయ్యానికి సిద్దంకండి
– నా కూతురునే పార్టీ మారమన్నారు
– ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర
– పదినెలల్లో ఎన్నికలు, పాత వారికే ఎమ్మెల్యే టిక్కెట్లు
– విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఎదురుదాడికి పాల్పడే యోచనలో ఉన్న కమలం పార్టీతో కయ్యానికి సిద్దంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ పలు కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రం తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. చివరికి తన కూతురు ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీ మారమని అడిగారని అన్నారు. ఇంతకంటే ఘోరం ఉంటుందా.. బీజేపీపై మండిపడ్డారు. కావున బీజేపీ నుంచి ఎదురయ్యే దాడిని సమర్థంగా తిప్పికొట్టాలని అందరు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్రం ఈడి దాడులు చేస్తే తిరంగబడాలన్నారు. సీబీఐ, ఈడీ దాడులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. మన దగ్గర కూడా ప్రయత్నించి అడ్డంగా దొరికారని గుర్తు చేశారు. ఏది ఏమైనా బీజేపీతో పోరాడాల్సిందే అని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఆ పార్టీ కుట్రలన్నింటినీ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చట్టం తన పని తాను చేస్తోందన్నారు. మరోవైపు ఎన్నికలకు పది నెలలే ఉందని.. ప్రతి ఒక్కరు నియోజవర్గంలో ఉంటూ.. ప్రజల మధ్య ఉండాలని ఆదేశించారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని.. ప్రతి ఎమ్మెల్యే నిత్యం ప్రజలతో మాట్లాడాలి అని సూచించారు. వచ్చే అసెంబ్లీ కొందరు ఎమ్మెల్యేలను మార్చుతారని వస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల మార్పు ఎంతమాత్రం ఉండదన్నారు. మళ్లీ పాత వారికే టికెట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

