పది రోజులే డెడ్‌లైన్..!
– చైర్ పర్సన్ కుర్చీ దిగడం ఖాయం
– ఎమ్మెల్యే వర్గం నేతల ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి: పది రోజుల్లో తాండూరు మున్సిపల్ రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాండూరు మున్సిపల్ రాజకీయం అనగానే చైర్ పర్సన్ రెండున్నరేళ్ల ఒప్పందమే అందరికి గుర్తుకొస్తుంది. రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసి 5నెలలు గడిచినా రాజీనామా అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో చైర్ పర్సన్ పదవిపై రెండున్నర ఏళ్ల ఒప్పందం జరిగిందనే విషయం అందరికి తెలిసిందే. ఇందులో ముందుగా చైర్ పర్సన్‌గా తాటికొండ స్వప్న పరిమళ్ పదవి చేపట్టారు. రెండున్నరేళ్లు ముగిసిన తరువాత తదుపరి చైర్ పర్సన్‌గా పట్లోళ్ల దీపా నర్సింలుకు అవకాశం కల్పించాలని ఒప్పంద రాజకీయాల సారాంశం. అయితే రెండున్నరేళ్ల ఒప్పంద కాలం ముగిసి దాదాపు 5నెలలు దాటినా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పదవికి రాజీనామా చేయలేదు. ఇందుకోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి సబితారెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలు చేసిన ఫలితాలు ఫలించలేదు. చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అనుచర వర్గానికి చెందడంతో మంత్రులు ఆయనను సంప్రదించారు. అయితే తాండూరు చైర్పర్సన్ స్వప్న రాజీనామాకు అంగీకరించడం లేదని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఎంపీ రంజిత్‌రెడ్డికి తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే ఈనెలాఖరు నాటికి చైర్పర్సన్ స్వప్న చైర్పర్సన్ పదవి నుంచి తప్పుకోవడమో, తప్పించడమో జరుగుతుందని మాత్రం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గం గట్టిగా చెబుతోంది. అంటే సరిగ్గా ఇంకా పది రోజుల డెడ్‌లైన్ ఉందని.. ఆలోగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కుర్చి దిగిపోవడం ఖాయమని ఎమ్మెల్యే వర్గీయులు పేర్కొంటున్నారు. మరోవైపు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఎమ్మెల్సీ వర్గీయులు మాత్రం కుర్చీ దిగేదిలేదని.. రాజకీయ కక్షతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చైర్ పర్సన్ సన్నిహితులు పేర్కొంటున్నారు.
గమనిక: ఈ వార్త ఓ ప్రధాన పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా అందించడం జరిగింది.

