ఇరుముళ్లతో శబరికి బయల్దేరిన అయ్యప్ప స్వాములు
– తాండూరు నుంచి 18 మంది స్వాముల పయనం
– స్వాములను దర్శించుకున్న భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: నలభై ఒక్క రోజుల పాటు కఠిన నియమాలతో అయ్యప్ప దీక్షను పూర్తి చేసిన తాండూరు అయ్యప్ప స్వాములు శబరి యాత్రకు బయల్దేరారు. బుధవారం తాండూరు అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి తరలివెళ్లారు. గురుస్వాములు శ్రావణ్ గౌడ్, వేణు గౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాల దీక్ష పూర్తి చేసిన 18 మంది స్వాములు శబరి యాత్రకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామికి ఇష్టమైన ఇరుముళ్లను కట్టుకున్నారు. అంతకుముందు ఆలయంలో వెలసిన అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆలయం మార్మోగింది. శబరికి బయల్దేరిన స్వాములను కుటుంబ సభ్యులు, భక్తులు పాదాబివందనం చేసి మొక్కులు తీర్చుకున్నారు. అయ్యప్ప స్వాములు తలపై ఇరుముళ్లను పెట్టుకుని మణికంఠ నామస్మరణతో ముందుకు సాగారు.

