కోడిని చంపారని కోపమొచ్చి..!

క్రైం జాతీయం తెలంగాణ హైదరాబాద్

కోడిని చంపారని కోపమొచ్చి..!
– రోడ్డును దిగ్బంధించిన గ్రామస్తులు
– దారంతా నిలిచిపోయిన వాహనాలు
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: లారీతో ఢీకొట్టి కోడిని చంపేశారని ఊరోళ్లకు కోపమొచ్చింది. వెంటనే గ్రామస్తులంతా ఏకమై రోడ్డును దిగ్బందించి.. దర్నాకు దిగారు. ఈ విచిత్రమైన సంఘటన తెలంగాణ రాష్ట్రం కొమురంభీం జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్‌ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన దంద్రే బండయ్యకు సంబంధించిన కోడి పోచమ్మవాడ ప్రధాని రోడ్డు మీదకు వచ్చింది. అదే సమయంలో కంకర లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ కోడిని ఢీకొట్టింది. గమనించిన గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే కోడిని ఢీకొట్టిన లారీని అడ్డగించి ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారి మట్టి, కంకర పనులను అడ్డుకుని నిరసన చేపట్టారు. దీంతో లారీల రాకపోకలు స్థంబించి పోయాయి. దారి పొడవున భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. లారీ డ్రైవర్ల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న గ్రామస్తులతో మాట్లాడి సర్దిజెప్పే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు ఎంతకీ అంగీకరించకపోవడంతో ఆందోళనను ఉదృతం చేశారు. ఈ క్రమంలో బాబాసాగర్ గ్రామంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు గ్రామస్తులు శాంతించేందకు అంగీకరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.