పైసలిస్తేనే పని..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పైసలిస్తేనే పని..!
– సబ్‌ రిజిస్ట్రార్‌ను వలలో వేసుకున్న ఏసీబీ అధికారులు
– భూ రిజిస్ట్రేషన్ రద్దు కోసం డబ్బులు డిమాండ్
– మద్యవర్తి ద్వారా రూ. 50వేలు తీసుకుంటుండగా ఏసీబీ దాడి
– ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు
– బాధితుడు టీఆర్ఎస్ నాయకుడు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పైసలిస్తేనే పనిచేస్తానని డబ్బులు డిమాండ్ చేసిన సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారిని ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. మద్యవర్తి ద్వారా రూ. 50 వేలు తీసుకుంటుండగా మాటు వేసి అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న జమీరోద్దీన్‌ను సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..
తాండూరు పట్టణానికి చెందిన ఈర్షాద్ (టీఆర్ఎస్ నాయకులు) దగ్గర మూడేళ్ల క్రితం యాలాల మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన హీర్యా నాయక్ రూ. 5 లక్షలు అప్పుగా తీసుకున్నారు. దీనికి గ్యారంటీగా హీఠ్యా నాయక్ తనకు చెందిన భూమిలో కొంత ఈర్షాద్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. తాజాగా హీర్యా నాయక్ ఈర్షాద్‌కు చెల్లించాల్సిన రూ. 5లక్షలు తిరిగి ఇచ్చేశాడు. భూమి ఈర్షాద్ పేరుపై ఉండడంతో దానిని తిరిగి ఇచ్చె ఎందుకు భూ రిజిస్ట్రేషన్ రద్దు అవసరం ఏర్పడింది. దీంతో గత 15 రోజుల క్రితం ఈర్షాద్ తాండూరు సబ్ రిజిస్ట్రార్ జమీరోద్దీన్ ను ఆశ్రయించారు. అయితే ఇందుకు సబ్ రిజిస్ట్రార్ రూ. 1 లక్ష డిమాండ్ చేయగా చివరకు రూ. 50 వేల వరకు ఒప్పందం జరిగిందని డీఎస్పీ సూర్యనారాయణ చెప్పుకొచ్చారు. ఆపై ఈర్షాద్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారని, పక్కా ప్రణాళికలు సిద్దం చేసి ఒప్పందం మేరకు సోమవారం ఈర్షాద్ డబ్బులు తీసుకుని వచ్చిన సమయంలో ఏసీబీ అధికారులు మాటు వేశారు. సబ్ రిజిస్ట్రార్ జమీరోద్దీన్ డబ్బులను నేరుగా తీసుకోకుండా సమద్ అనే డాక్యుమెంటర్ రైటర్ వద్ద పనిచేస్తున్న జహీరోద్దీన్ ద్వారా రూ. 50 వేలను తీసుకున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించి సబ్ రిజిస్ట్రార్ జమీరోద్దీన్‌తో పాటు మద్యవర్తి జహీరోద్దీన్‌లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారిని మంగళవారం ఏసీబీ కోర్టులో హజరు పరిచి జైలుకు తరలిస్తామని డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.


డాక్యుమెంట్ రైటర్లు గయాబ్

పని దినాలలో క్రయ, విక్రయ దారులతో కళకళలాడే డాక్యుమెంట్ రైటర్లు గయాబ్ అయ్యారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయని వార్త తెలిసిన నిమిషాల్లో కార్యాలయాలకు తాళాలు దర్శనమిచ్చాయి. ఏసీబీ దాడులకు భయపడి ఎవరికి చెందిన వారి షాపులకు తాళాలు వెళ్లిపోయినట్లు స్థానికులు గుసగులాడుకున్నారు.