వంద మందితో హైస్ ఎటాక్…!
– సినిమా స్టైల్లో యువతి కిడ్నాప్
– తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం
– రంగారెడ్డి జిల్లా ఆధిభట్లలో సంఘటన
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఒకే వంద మంది ఇంటిపై ఎటాక్ చేసి త్వరలో కాబోయే పెళ్లి కూతురును ఎత్తుకెళ్లారు. పక్కా సినిమా స్టైల్లో జరిగిన ఈ కిడ్నాప్ తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనంగా మారింది.రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో జరిగిన యువతి కిడ్నాప్ కలకలం రేపుతోంది. తుర్కయాంజల్ మున్సిపాలిటీ మన్నెగూడలోని సిరి టౌన్ షిప్లో నవీన్ అనే యువకుడు డీసీఎం, కార్లలో 100 మంది మార్బలంతో యువతి ఇంటికి వెళ్లాడు. తమను కొట్టి తమ కుమార్తెను తీసుకెళ్లినట్టు దామోదరెడ్డి, నిర్మల దంపతులు ఆరోపించారు.
ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తులు వెళ్తూ వెళ్తూనే కిటికి అద్దాలు పగులగొట్టి… ఇంట్లోని అన్ని రూముల్లో కలియ తిరుగుతూ సామగ్రి మొత్తం ధ్వంసం చేశారని తెలిపారు. ఇంటి ముందు ఉన్న కారును సైతం ధ్వంసం చేశారని, తమపై కర్రలతో దాడి చేసేందుకు యత్నించి.. దాడి చేసి వీరంగం సృష్టించారని తెలిపారు. గతంలో నవీన్‌రెడ్డిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు యువతి కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయినప్పటికీ వేధిస్తున్న నవీన్‌రెడ్డి.. పోలీసుల అండతోనే దాడికి తెగబడ్డారని ఆరోపించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ రహదారిపై బాధితులు ధర్నాకు దిగారు. ఈ ఘటనతో మన్నెగూడలో ఉద్రిక్తత నెలకొంది. గతంలో నవీన్‌రెడ్డి, యువతికి పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు బాధితుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నవీన్, వైశాలి ప్రేమించుకుంటున్నారని.. ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవడంతోనే ఇలా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.


