తాండూరు కందికి బ్రాండ్‌

జాతీయం తాండూరు తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్

తాండూరు కందికి బ్రాండ్‌
– జీఐ గుర్తింపుతో ఎగుమతులకు గ్రీన్‌ సిగ్నల్‌
– ఫలించిన తెలంగాణ సర్కారు కృషి
దర్శిని డెస్క్‌: దేశంలో అద్బుతం అనిపించే ఉత్పత్తులు, ఆహార పదార్ధాలు, తయారీ వస్తువులకు భౌగోళిక గుర్తింపు ఇస్తారు. అంటే అవి దేశంలో బ్రాండ్‌ అన్నమాట. అందులో వికారాబాద్ జిల్లా తాండూరు కంది పప్పు కూడ ఆ బ్రాండ్‌ గౌరవాన్ని దక్కించుకుంది. తెలంగాణలో ఇప్పటికే పదిహేను ఉత్పత్తులు, వస్తువులు జీఐ గుర్తింపును పొందాయి. గతకొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యంగల తాండూరు కందిపప్పు, నిజామాబాద్‌ పసుపు, బాలానగర్‌ సీతాఫలం, వరంగల్‌ మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం ప్రభుత్వం తీవ్రప్రయత్నాలు చేసింది. తెలంగాణలో ఇప్పటివరకు పోచంపల్లి ఇక్కత్‌, నిర్మల్‌ కొయ్యబొమ్మలు, నిర్మల్‌ ఫర్నీచర్‌, నిర్మల్‌ పెయింటింగ్స్‌, గద్వాల చీరలు, హైదరాబాద్‌ హాలీమ్‌, చేర్యాల్‌ పెయింటింగ్స్‌, సిద్దిపేట గొల్లబామ, నారాయణపేట హ్యాండ్లూమ్‌ చీరలు, పోచంపల్లి ఇక్కత్‌ బొమ్మ, ఆదిలాబాద్‌ డోక్రా, వరంగల్‌ రగ్గులకు భౌగోళిక గుర్తింపు లభించింది. ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల ఆదేశాలతో తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు విశేష కృషి చేశారు. 2019 నుంచి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించారు. వరంగల్‌, మహబూబ్‌నగర్‌, పాలెం రకాలతో పోలిస్తే తాండూరు రకం ప్రత్యేకతల గురించి నివేదిక పంపారు. దీంతో తాండూరు కందిపప్పుకు జీఎస్టీ గుర్తింపు లభించింది. తాండూరు కందిపప్పు దేశంలోని వివిధ రాష్ర్టాలతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి అవుతోంది. జీఐ గుర్తింపుతో తాండూరు కంది పప్పు ఎగుమతులకు గ్రీన్‌ సిగ్నల్‌ పడిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

అందులో సాటి
దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో కందులను సాగు చేసి పప్పుగా మారుస్తున్నా తాండూరు కంది పప్పును పోలిన రుచి, వాసన ఉండదు. ఇక్కడి నేలల స్వభావంతో పండించే కందులు నాణ్యంగా ఉండడడమే కాకుండా పప్పు కూడా అలాగే ఉంటుంది. పోషకాలూ ఎక్కువే. దీనికి భౌగోళిక గుర్తింపు సాధించడంలోఇప్పటివరకు తాండూరు కందిపప్పు పేరుతో ఇతర రాష్ట్రాలకు చెందిన పప్పును దిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడుల్లో ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. తాజా పరిణామంతో అలా కుదరదు.