హైకోర్టు తీర్పు వచ్చాకే విచారణకు వస్తా
– ఈడీకి మేయిల్ చేసిన పైలెట్ రోహిత్ రెడ్డి
– చర్యలకు సిద్దమవుతోన్న ఈడీ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఈడీ నోటీసుల విచారణపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సంబంధంలేని కేసులో తనను ఈడీ విచారించడంపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైకోర్టులో రిట్ ఫిటిషన్ వేసిన విషయం తెలిసిందే. రిట్ ఫిటిషన్‌పై హైకోర్టులో తీర్పు వచ్చేంత వరకు ఈడీ విచారణకు హాజరు కాకుడదని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా హైకోర్టులో తీర్పు వచ్చాకే విచారణకు హాజరవుతానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీకి మేయిల్ పంపించినట్లు తెలిసింది. రాష్ట్రంలో సంచలమైన ఎమ్మెల్యేల ఎర కేసులో రోహిత్ రెడ్డి కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును సిట్ ను చేపడుతుండగా తాజాగా కేసును సీబీఐ అప్పగించడాన్ని ఆయన తప్పుబట్టారు. దీంతో రోహిత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటీవలే ఈడీ పైలెట్ రోహిత్ రెడ్డికి నోటీసులు అందించి విచారిస్తుంది. ఇప్పటికే రెండు రోజులు రోహిత్‌ని పశ్నించింది ఈడీ. ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ఈడీ విచారణకు హాజరు కావడం లేదంటూ.. అధికారులకు రోహిత్ రెడ్డి మెయిల్ చేశారు. హై కోర్టు లో రిట్ పిటిషన్ వేసిన నేపథ్యంలో విచారణ కు హాజరు కానని వెల్లడించారు. కాగా.. రేపు (బుధవారం) హై కోర్టు లో రోహిత్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరగనుంది. హై కోర్టు తీర్పు వచ్చాకే తదుపరి విచారణ పై నిర్ణయం తీసుకుంటానని రోహిత్ రెడ్డి తెలిపారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి కార్యాచరణ, డివిజన్ బెంచ్‌కు వెళ్లాలా..? లేక సుప్రీం కోర్టును ఆశ్రయించాలా..? అనేది నిర్ణయించుకుంటామన్నారు. రోహిత్ రెడ్డి గైర్హాజరు తో ఈడీ తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నందకుమార్ ఇచ్చే స్టేట్‌మెంట్ ఆధారంగా ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది..! ఈ క్రమంలో ఆయన గైర్హాజరు కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

