నీటి గుంతలో వ్యక్తి మృతదేహం..!
– మద్యం మత్తులో పడి దుర్మరణం
– పెద్దేముల్ మంబాపూర్‌లో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : నీటి గుంతలో ఓ వ్యక్తి మృతదేహం లభించిన సంఘటన కలకలం రేపింది. ఈ సంఘటన గురువారం పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

స్థానికులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు.. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మర్పల్లి అంజిలయ్య(45) హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తున్నారు. భార్య లక్ష్మీ, కూతురు స్వాతిలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం రాఖీ పండగ సందర్భంగా మంగళవారం భార్య లక్ష్మీ గారి పుట్టిన ఊరు పెద్దేముల్ మండలం చైతన్య నగర్ కు అంజిలప్ప కుటుంబంతో కలిసి వచ్చాడు. సాయంత్రం బస్సు దిగిన తరువాత భార్య లక్ష్మీ, కూతురు స్వాతిలకు ఇంటికి వెళ్లమని, నేను తరువాత వస్తానని వారిని పంపించాడు.

చీకటి పడినా కూడా అంజిలప్ప ఇంటికి రాలేదు. కొండాపూర్‌కు వెళ్లి ఉంటాడని అనుకున్నారు. బుధవారం లక్ష్మీ, స్వాతిలు కొండాపూర్‌కు వెళ్లారు. అక్కడికి కూడా అంజిలప్ప రాలేదని గుర్తించారు. గురువారం ఉదయం మంబాపూర్ గ్రామ సమీపంలోని రక్తమైసమ్మ దేవాలయం సమీపంలోని నీటి గుంతలో వ్యక్తి మృతదేహం లభించగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందింది అంజిలప్పగా నిర్దారించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురుకి తరలించారు. అయితే అంజిలప్ప మద్యం మత్తులో నీటిగుంతలో పడి మృతి చెంది ఉంటాడని, అతని మరణంలో అనుమానాలు లేవని కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

