వచ్చే నెలలో పల్లె పల్లెకు, వాడ వాడకు ఎమ్మెల్సీ
– ఆర్డీఓ జోక్యంతోనే పట్టణంలో అభివృద్ధి అడ్డంకులు
– చైర్ పర్సన్ పూర్తి కాలం వరకు కొనసాగుతారు
– మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: వచ్చేనెల జనవరిలో ప్రజాక్షేత్రంలో పర్యటించడం జరుగుతుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కౌన్సిలర్లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో నిర్వహించిన పల్లె పల్లెకు ఎమ్మెల్సీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడం జరుగుతుందన్నారు. వచ్చేనెల జనవరం నుంచి పల్లె పల్లెకు ఎమ్మెల్సీతో పాటు మున్సిపల్ లో వాడ వాడకు ఎమ్మల్సీ కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలోనే దాదాపు రూ. 2వేల కోట్లు నిధులు తీసుకరావడం జరిగిందని, ఇప్పటికి ఆ పనులు కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. కొత్తగా తాండూరుకు మరిన్ని నిధులు రావడం సంతోషకరమన్నారు.
ఆర్డీఓ జోక్యంతోనే ఇబ్బందులు
తాండూరు మున్సిపల్ ఆర్డీఓకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడంతో.. గత రెండేళ్లుగా ఇబ్బందులు ఏర్పడ్డాయని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆరోపించారు. చైర్ పర్సన్‌కు సర్వ అధికారులు ఉన్నా ఆర్డీఓ జోక్యం చేసుకుని ఆమె అధికారాలను కాలరాశారని అన్నారు. దీంతో హక్కుల కోసం చైర్ పర్సన్ కోర్టుకు వెళ్లడం జరిగిందని వివరించారు. ఈ వివాదానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని, ఆర్డీఓపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మరోవైపు గత 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ఏనాడు మున్సిపల్ వ్యవహరాల్లో జోక్యం చేసుకోలేదని అన్నారు. అభివృద్ధిని ఎప్పుడు అడ్డుకోలేదని స్పష్టం చేశారు. అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మరోవైపు తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్‌గా స్వప్న పరిమళ్ పూర్తి పదవి కాలం కొనసాగుతారని అన్నారు. మున్సిపల్ కొత్త చట్టం ప్రకారం ఆవిశ్వాసం పెట్టినా నెగ్గుతామని ధీమా వ్యక్తం చేశారు.
రూ. 1కోటితో వార్డుల అభివృద్ధి
తాండూరు మున్సిపల్ పరిధిలోని వార్డులు అభివృద్ధికి నిధులు కేటాయించడం జరుగుతుందని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తెలిపారు. మైన్స్ నిధుల నుంచి తాండూరు. మున్సిపల్‌కు రూ. 1 కోటి నిధులు తీసుకరావడం జరిగిందని, ఇందుకు సంబంధించిన ప్రొసిడింగ్స్ ను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌కు అందజేశారు. త్వరలోనే కౌన్సిలర్లు కోరిన విధంగా వార్డులకు కేటాయించి అభివృద్ధి పనులు ప్రారంభించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణలు మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, అబ్దుల్ రజాక్, ప్రవీణ్ గౌడ్, వెంకన్న గౌడ్, బోయరవి, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, యువనాయకులు బిర్కడ్ రఘు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

