కేంద్ర నిధులకు సర్కారు ఎగనామం
– టీఆర్ఎస్ ప్రభావం తగ్గడంతో బీఆర్ఎస్
– సంక్షేమాన్ని విస్మరిస్తున్న సర్కారు
– చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
– తాండూరులో ఉచితంగా బ్లాంకెట్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేస్తే బీఆర్ఎస్ సర్కారు వాటికి ఎగనామం పెడుతోందని బీజేపీ నాయకులు, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడి పిలుపు మేరకు చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బుధవారం తాండూరులో బ్లాంకెట్ల పంపిణీ నిర్వహించారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ రావుల ఆధ్వర్యంలో పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో నిరాశ్రయులకు, వృద్దులకు బ్లాంకెట్లను పంపిణీ చేశారు. అనంతరం పాత తాండూరులో కొనసాగున్న సమీకృత వసతి గృహ విద్యార్థులకు ఉచితంగా బ్లాంకెట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రాల అభివృద్ధికి మోడి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కేంద్రానికి వచ్చే పన్నుల్లో 42 శాతం తిరిగి రాష్ట్రాలకు కేటాయిస్తుందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎన్నో నిధులు మంజూరు చేస్తే సీఎం కేసీఆర్ ఆ నిధులకు ఎగనామం పెడుతున్నారని ఆరోపించారు. సర్పంచులకు నిధులు మంజూరు చేస్తే వాటిని కూడ కాజేసేందుకు యత్నించారని విమర్శించారు. నిరుపేదలకు ఇప్పటి వరకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యార్థులకు మంచి భోజనం, మరుగుదొడ్ల వసతి, దుప్పట్లు వంటి సదుపాయాలను అందించక వారి సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభావం తగ్గడంతోనే బీఆర్ఎస్ పార్టీగా మార్చారని అన్నారు. బీజేపీకి మత తత్వ పార్టీ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ మత తత్వ పార్టీ కాదని, దేశ ప్రజల సేవ చేయడమే బీజేపీ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్, గ్రంధాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, మహిళ మోర్చ రాష్ట్ర నాయకురాలు అంతారం లలిత, తాండూరు పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, కౌన్సిలర్ సాహు శ్రీలత, మండల అధ్యక్షులు శేఖాపురం ఆంజనేయులు, సీనీయర్ నాయకులు పూజారి పాండు, పట్టణ ప్రధాన కార్యదర్శి దోమ కృష్ణ, భాను, తాండ్ర నరేష్, రాజు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

