అసమ్మతికి షాక్..!
– అవిశ్వాసంపై హైకోర్టులో ఫిటీషన్లు
– దాఖలు చేసిన తాండూరు, వికారాబాద్ చైర్ పర్సన్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు మున్సిపల్లోని అసమ్మతి వర్గాలకు షాక్ తగిలింది. ఈ రెండు మున్సిపాల్టీలలో చైర్ పర్సన్ మంజుల, స్వప్న పరిమళ్లపై అవిశ్వాసం పెట్టాలని వ్యతిరేక కౌన్సిలర్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్కు వేరు వేరుగా తీర్మానాలను అందించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలు వికారాబాద్, తాండూరు మున్సిపల్ రాజకీయాలలో తుఫాన్ రేపాయి. వికారాబాద్లో కౌన్సిలర్ పుష్పలతా రెడ్డి ఆధ్వర్యంలో 18 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు తెలపగా తాండూరులో వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో దాదాపు 24 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. వ్యతిరేక కౌన్సిలర్లు వేసిన పాచికను ధీటుగా ఎదుర్కొనేందుకు వికారాబాద్, తాండూరు చైర్ పర్సన్లు సిద్దమయ్యారు. జిల్లా కలెక్టర్కు చేసిన అవిశ్వాస తీర్మానాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. సోమవారం తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వికారాబాద్ చైర్ పర్సన్ మంజులలు వేరు వేరుగా ఈ పిటిషన్లను దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పాలనలో అవిశ్వాస తీర్మానాల గడువును నాలుగేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుందని, ఈ అంశం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. కావున ఈ బిల్లుపై ఉత్తర్వులు వచ్చేంత వరకు అవిశ్వాస తీర్మానాలను పెండింగ్లో ఉంచాలని కోరారు. దీనిపై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే మున్సిపల్ చైర్ పర్సన్లపై పెట్టిన అవిశ్వాస తీర్మానాలపై వారు కోర్టుకు వెళ్లడంతో అసమ్మతి వర్గాలకు షాక్ తగిలింది. ఈ వ్యవహారం రెండు మున్సిపాల్టీలలో రాజకీయాలను మరింత వేడేక్కించాయి.

