బీఆర్ఎస్‌ది పిరికిపంద చర్య
– సంబంధం లేనివారిపై దాడి సిగ్గుచేటు
– చేతనైతే రాజకీయంగా ఎదుర్కొవాలి
– దాడి నియంత్రణలో పోలీసులది చేతగాని తనమే
– నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి
– బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్
– మురళీకృష్ణ గౌడ్ కుటుంబానికి పరామర్శ
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ నేత, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ కుటుంబపై బీఆర్ఎస్ పార్టీ చేసిన దాడి ముమ్మాటికి పిరికిపంద చర్యే అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. దాడులను నియంత్రించడంలో విఫలైమన పోలీసులు చేతగాని తనానికి ప్రతీకగా నిలిచారని విమర్శించారు. రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు మురళీకృష్ణ గౌడ్ కుటుంబంపై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేసిన ఘటనపై బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తాండూరు పట్టణంలోని మురళీకృష్ణ గౌడ్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు సహజమన్నారు. బుద్ధి, జ్ఞానం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలే తప్పా ఇలాంటి దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారని తెలిసి దాడి చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. బీఆర్ఎస్ నాయకులు గుండాల్లా మురళీకృష్ణ గౌడ్ కుటుంబ సభ్యులపై దాడి చేస్తే నియంత్రించడంలో పోలీసులు విఫలం కావడం వారి చేతగాని తనానికి నిదర్శనమన్నారు. ఇలాంటి ఘటనలోనే పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకం పోతుందని అన్నారు. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాళ్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులే యువకులకు డ్రగ్స్ మత్తులో దాడులకు పాల్పడి ఉంటారని, ఇప్పటికైనా మానవత్వం ఉంటే మార్పుతెచ్చుకోవాలన్నారు. ఇలాంటి పనిచేయించిన నాయకున్ని నిలదీయాలన్నారు. బీఆర్ఎస్ నాయకుల అండదండలు ఉంటే క్రిమినల్ ఏమైనా చేసుకోవచ్చనే పరిస్థితి ఏర్పడిందన్నారు. పోలీసు వ్యవస్థ నిజాయితీగా పనిచేయాలని అన్నారు. అదేవిధంగా మురళీకృష్ణ గౌడ్ కారు డ్రైవర్ మృతిపై కూడ పోలీసులు కేసును తారుమారు చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీనిపై కూడ సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకుల ఆగడాలకు కొన్ని నెలల్లోనే చెల్లిపోతాయని, తరువాత దుకాణాలన్ని బంద్ చేసుకోవాల్సిందే అన్నారు. మురళీకృష్ణ గౌడ్ కుటుంబంపై దాడులు చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులకు బీజేపీ ఎప్పుడూ భయపడదని హెచ్చరించారు. ధర్మం కోసం పోరాడుతుందని, బీఆర్ఎస్ దాడులను ఎదురించి పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఏసీఆర్, జిల్లా అధ్యక్షులు ప్రధానంగా రెడ్డి, మాజీ అధ్యక్షులు కరణం ప్రహల్లాద్ రావు, ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్, మహిళ మోర్చ నాయకురాలు అంతరం లలిత, సాహు శ్రీలత, కౌన్సిలర్ బంటారం లావణ్య, బీజేపీ జిల్లా కార్యదర్శి బంబారం భద్రేశ్వర్, పటేల్ విజయ్ కుమార్, కృష్ణ ముదిరాజ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

