పోటో దిగాకే. చీర..!
– యాప్‌లో నమోదు తరువాత అందజేత
– యువతులకు సల్వార్ కమీజ్, లంగావోణీలు
– ఇందిరమ్మ చీరల పంపిణీలో రూల్స్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఇందిరమ్మ చీరల పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు అమలు చేయబోతోంది. పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా చీరల పంపిణీపై నిబంధనలు పెట్టబోతోంది. ఈ రూల్స్ ప్రకారమే మహిళలకు చీరలను పంపిణీ చేయబోతోంది.

ప్రతి మండలంలో సబ్‌కలెక్టర్ లేదా ఆర్డీవోలు పర్యవేక్షణ అధికారులుగా ఉంటారు. మండల స్థాయిలో ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం గ్రామాల్లో పంపిణీ చేపట్టాలని నిర్దేశించింది. చీరల పంపిణీ సందర్భంగా మహిళలు ఆధార్ కార్డు చూపాలి. చీరను తీసుకున్నట్టు ఫొటో దిగాలి. 18 ఏళ్లు దాటినవారందరికీ చీరలు అందిస్తారు. 15 నుంచి 18 ఏళ్ల లోపువారికి సల్వార్ కమీజ్‌లు లేదా లంగావోణీ వంటివి పంపిణీ చేయాలని సెర్ప్ యోచిస్తోంది. ప్రభుత్వ అనుమతి అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారు.

యాప్‌లో నమోదు
చీరల పంపిణీకి పకడ్బందీగా చేపట్టేందుకు సెర్ప్ చర్యలు చేపట్టింటి. చీరలు పంపిణీ చేసిన వారి వివరాలను యాప్‌లో నమోదు చేయాలని నిర్ణయించింది. పెన్షనర్ల ముఖగుర్తింపు కోసం వినియోగిస్తున్న యాప్‌ను పంపిణీలో వినియోగిస్తారు. మహిళా సంఘాల సభ్యులకు ఆధార్ నంబర్‌తో యాప్‌లో ఫొటో తీసుకొని చీరలు ఇస్తారు.

సభ్యులు కాకుంటే సభ్యత్వాన్ని నమోదు చేసుకున్న తర్వాత అందిస్తారు. మహిళా సంఘాల ద్వారా ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి చీరలు పంపిణీ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క సూచనలకు అనుగుణంగా సెర్ప్ ఆదేశాలు ఇచ్చింది. చీరల పంపిణీపై రోజువారీగా నివేదికలను సెర్ప్ ప్రధాన కార్యాలయానికి జిల్లా కలెక్టర్లు పంపించాలి.

ఇదికూడా చదవండి…

