తాండూరు డీఎస్పీపై హోం మంత్రికి ఫిర్యాదు
– స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేసిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– ఫిర్యాదులో ఏముందంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీకి వికారాబాద్ జిల్లా తాండూరు డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఫిర్యాదు చేశారు. గురువారం హైదరాబాద్‌లో హోం మంత్రి మహమూద్ అలీని చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ స్థానిక నేతలతో కలిసి స్వయంగా ఫిర్యాదును అందజేశారు. ఈనెల 19న చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర అనంతరం పట్టణంలోని శివాజీ చౌరస్తాలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో డీఎస్పీ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతుండగా మైకు లాక్కుని అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ డీఎస్పీకి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించారని అభియోగాలతో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌తో పాటు కౌన్సిలర్ రాము, మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గురువారం రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీని కలిసి ఫిర్యాదు చేశారు. సమావేశంలో తనను అవమాన పరచడమే కాకుండా తనపై అక్రమ కేసు పెట్టారని చైర్ పర్సన్ తన ఫిర్యాదులో హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమావేశం వేధికపై నుంచి బలవంతంగా కిందకు దించారని వివరించారు. కావున తాండూరు డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు హోం మంత్రి డీఎస్పీపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు డీఎస్పీపై హోంమంత్రితో పాటు డీజీపీ, ఇంటలిజెన్స్ ఐజీలకు ఫిర్యాదులు చేయడం జరిగిందని ప్రకటనలో తెలిపారు. హోంమంత్రిని కలిసిన వారిలో తాండూరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొబ్బిలి శోభారాణి, కౌన్సిలర్లు నీరజ బాల్ రెడ్డి, మణపురం రాము, బోయ రవి రాజు, బీఆర్ఎస్ మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్, హిందూ ఉత్సవ కమిటీ కార్యదర్శి పట్లోళ్ళ నర్సింహులు, నాయకులు మసూద్, పరిమల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

