ఇక్కడితో ఇన్నింగ్స్ ముగిస్తున్నా..!
– భారత్ యాత్ర ఉత్సహాం నింపింది
– కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ
– ప్లీనరీ సమావేశంలో కీలక వాఖ్యలు
దర్శిని డెస్క్: ఇక్కడితో నా ఇన్నింగ్స్ ముగిస్తున్నా అంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వాఖ్యలు చేశారు. ఈ వాఖ్యలు పార్టీ వర్గాలలో చర్చనీయాంశమయ్యాయి. రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సోనియా గాంధీ చేసిన వాఖ్యలు గందరగోళంకు గురిచేసింది. ప్లీనరీలో సోనియా గాంధీ మాట్లాడుతూ.. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారిందని అన్నారు. దేశప్రజలు సామరస్యం, సమానత్వం, ఓర్పు, సహనం కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రజల పక్షాన నిలుస్తోందని, వారి కోసం పోరాడేందుకు సిద్ధంగా ఈ యాత్రతో ప్రజల్లో నమ్మకం కలిగిందన్నారు. 1998లో తొలిసారిగా పార్టీ అధ్యక్షబాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి 25 ఏళ్ల ఈ సుదీర్ఘ కాలంలో పార్టీ ఎన్ని విజయాలు సాధించింది. క్లిష్ట పరిస్థితులనూ ఎదుర్కొంది. ప్రత్యేకంగా 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ పని తీరు ఎంతో సంతృప్తినిచ్చింది. ఆ తర్వాత తాజాగా భారత్ జోడో యాత్రతో ఆ సంతృప్తి రెట్టింపయింది. ఆ ఆనందంతోనే ఈ ఇన్నింగ్స్‌కు ముగింపు చెప్పాలనుకుంటున్నా’’ అని సోనియా గాంధీ అన్నారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన ఖర్గేను ఆమె అభినందించారు. మరోవైపు సోనియా వాఖ్యలతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగుతున్నారని, అలా కాదు ఇకపై పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టనని మాత్రమే ఆమె చెప్పారని, ఇలా రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాయ్‌బరేలి నుంచి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. దీనిపై కాంగ్రెస్ స్పష్టత నిచ్చింది. సోనియా గాంధీ ప్రసంగం పూర్తయిన తర్వాత ఏఐసీసీ ఛత్తీస్‌గఢ్ ఇన్‌ఛార్జి కుమారి సెల్జా మాట్లాడుతూ.. సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగడం సంతోషంగా ఉందనే విషయాన్నే చెప్పారని, అంతేగాని ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడం ఆమె ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు. దీంతో గందరగోళ పరిస్థితులకు తెరపడినట్లయింది.

