కేంద్రానికి లాస్ట్ చాన్స్..!

తెలంగాణ హైదరాబాద్

కేంద్రానికి లాస్ట్ చాన్స్..!
– ధాన్యంపై ఢిల్లీకెళ్లి తేలుస్తాం
– కేంద్ర వైఖ‌రిపై కేసీఆర్ ఫైర్
– తెలంగాణ భవన్‌లో మీడియాతో కేసీఆర్

హైద‌రాబాద్, ద‌ర్శ‌ని ప్ర‌తినిధి: యాసంగిలో ధాన్యం కొనుగోలుతో విష‌యంలో కేంద్రానికి చివ‌రి అశ‌కాశం ఇచ్చి దేశ రాజ‌ధాని ఢిల్లికెళ్లి తాడో పేడో తేల్చుకుంటామ‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. శనివారం సాయంత్రం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు మీద జరుగుతున్న వ్యవహారంలో ఎన్నిసార్లు నిరంతరంగా డిమాండ్‌ చేసినా కేంద్రం నుంచి ఉలుకూ లేదు పలూకు లేకుండా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కేంద్రం వైఖరిని ఎండగట్టారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి ధాన్యం సేక‌రించాల‌ని కోరామ‌ని, దానికి ఒక టార్గెట్ నిర్దేశించ‌మ‌ని కోర‌డం జ‌రిగింద‌న్నారు. దీనికి కూడ ఎలాంటి స‌మాధానం ఇవ్వ‌డంలేద‌న్నారు. దీనిపై స్ప‌ష్ట‌త ఇవ్వాల్సిన బాధ్య‌త కేంద్రానిదేన‌న్నారు. ప్ర‌స్తుతం కేంద్రం త‌న నిర్ణ‌యాన్ని తేల్చుకోలేక‌పోతే అయోమ‌యంలో ఉంటార‌న్నారు. అనవసరమైన ఇబ్బందులు చాలా వచ్చే అవకాశం ఉంటుంద‌న్నారు. బాయిల్డ్‌ రైస్‌ కొనమని చెప్పినట్లు వ‌చ్చిన వార్త‌పై కూడ కేంద్రాన్ని అడుగుతామ‌న్నారు. రైతులకు ముందే చెబితే వేరే పంట వేసుకుందుం కదా అనే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. కొనుగోళ్ల‌పై ఎలాంటి స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో ద‌ర్నా చేయ‌డం జ‌రిగింద‌ని, దీనిపై కేంద్రం దిగివ‌చ్చి చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని చెప్పిన‌ట్లు గుర్తుచేశారు. ఈ మేర‌కు చివ‌రి ప్ర‌య‌త్నంగా రేపు ఢిల్లీకి వెళ్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మంత్రుల డెలిగేషన్‌, పార్లమెంట్‌ సభ్యులు డెలిగేషన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఫైనాన్స్‌ సెక్రెటరీ, అగ్రికల్చర్‌ సెక్రెటరీ, సివిల్‌ సప్లయ్‌ సెక్రెటరీ అధికారులు డెలిగేషన్‌ కలిసి మంత్రిని క‌లుస్తామ‌న్నారు. అదేవిధంగా ప్రధానిని కలిసి డిమాండ్‌ చేద్దాం అనుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.

రైతుల కుటుంబాల‌కు 3ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం
రైతు చ‌ట్టాల విష‌యంలో కేంద్రం వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల 700 నుంచి 750 మంది రైతులు చ‌నిపోవ‌డం బాధాక‌ర‌మ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. ఒత్తిడి, గుండెపోటు, ఇత‌ర కార‌ణాల‌తో రైతులు చ‌నిపోయార‌ని,వాళ్లంద‌రికీ సంఘీభావం ప్ర‌క‌టిస్తున్నట్లు తెలిపారు. ఆ కుటుంబాలను కాపాడే బాధ్య‌త ప్ర‌ధాని తీసుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దీంతో పాటు తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి అమ‌రుల కుటుంబాల‌కు 3 ల‌క్ష‌ల సాయం అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీని కోసం రూ..22.5 కోట్లు దానికి ఖ‌ర్చు అవుతాయ‌ని ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్నామ‌ని, రైతు నాయ‌కుల‌ను సంప్ర‌దించి.. ఆ కుటుంబాల‌కు అందించే ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు.

మూడు డిమాండ్ల‌ను నెర‌వేర్చాలి
కేంద్ర ప్ర‌భుత్వాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రుపున మూడు డిమాండ్ల‌ను కోరుతున్న‌ట్లు సీఎం కేసీఆర్ అన్నారు. చ‌నిపోయిన‌టువంటి ప్ర‌తి రైతు కుటుంబానికి 25 ల‌క్ష‌లు, రైతుల‌పై న‌మోద‌యిన కేసుల‌న్నీ ఎత్తివేత‌, పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చ‌ట్టం తీసుక‌రావాల‌నే ప్ర‌ధాన డిమాండ్ల‌ను చెప్పుకొచ్చారు. దాదాపు 15 కోట్ల రైతు కుటుంబాల డిమాండ్ మేర‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. వ‌చ్చే పార్ల‌మెంట్ స‌మావేశంలోనే ఆచ‌ట్టాన్ని పెట్టాలన్నారు.

విద్యుత్ చ‌ట్టాన్ని వెన‌క్కి తీసుకోవాలి
వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్‌ చట్టాన్ని కూడ కేంద్రం వెనక్కి తీసుకోవాల‌ని కేసీఆర్ డిమాండ్ చేశారు. విద్యుత్ చ‌ట్టాన్ని టీఆర్‌ఎస్‌ నుంచి చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామ‌న్నారు. లోక్‌సభలో, రాజ్యసభలో మాకున్న శక్తిమేరకు అడ్డుకునేందుకు పోరాడుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.