సామాన్యులకు షాక్..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ హైదరాబాద్

సామాన్యులకు షాక్..!
– మళ్లీ పెరుగుతున్న వంటనూనె ధరలు
– పెరుగుదలకు కారణాలు ఏమంటే
దర్శిని డెస్క్‌: దేశంలోని సామాన్యులకు నిజంగా షాకింగ్ న్యూసే. ఎందుకంటే రోజూ భోజనం తయారికి వినియోగించే వంట నూనె ధరలకు మళ్లి మండబోతున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే వేరుసెనగ నూనె ధర లీటరుకు రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగింది. దీంతో వేరుశనగ నూనె లీటరుకు రూ.180లకు చేరుకుంది. పామాయిల్‌ ధర లీటరుకు రూ.3 నుంచి రూ.5 వరకు ఎగబాకి ప్రస్తుతం రూ.104లకు చేరుకుంది. ఇక పొద్దు తిరుగుడు నూనె లీటరుకు రూ.135ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దేశీయంగా నూనె గింజల పంటల ఉత్పత్తి తగ్గడం, విదేశాల్లో వేరుసెనగ నూనెకు అధిక డిమాండ్‌ పెరగడం.. వంటి కారణాల వల్ల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం తర్వాత నుంచి చైనా మన దేశం నుంచి వేరుసెనగ దిగుమతుల్ని పెంచింది. పైగా ఆ దేశంలో వేరుసెనగ నూనెకు డిమాండు ఎక్కువ పలుకుతోంది.దిగుమతులు తగ్గిపోవడం, ఎగుమతులపై ఇండోనేసియా ఆంక్షలు విధించడం కారణంగా దేశీయంగా వంట నూనెల ధరలు పెరుతుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

దేశంలో నూనె ఉత్పత్తుల సాగు పరిస్థితి ఇలా
దేశంలో వేరుసెనగ సాగు, ఉత్పత్తిలో గుజరాత్‌ అగ్రస్థానంలో నిలుస్తుంది. మొత్తం ఉత్పత్తిలో 45 శాతం పంట ఆ రాష్ట్రంలోనే పండిస్తున్నారు. తర్వాత రాజస్థాన్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. గుజరాత్‌లోని గోండల్‌ ప్రాంతంలో వందకు పైగా నూనెతయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఆయిల్‌ఫెడ్‌ కూడా అక్కడి నుంచే నూనెను దిగుమతి చేసుకుని విజయ బ్రాండ్‌ పేరుతో విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 104 లక్షల టన్నుల వేరుసెనగ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా.. 100 లక్షల టన్నులే వస్తుందని ఈ నెల 14న విడుదలైన రెండో ముందస్తు అంచనాల్లో వెల్లడైంది. దేశంలో 9 రకాల నూనెగింజల పంటలు కలిపి 423 లక్షల టన్నులను లక్ష్యంగా నిర్ణయించగా, రెండో ముందస్తు అంచనాల ప్రకారం 400 లక్షల టన్నుల మేర వస్తుందని గుర్తించారు.ఐతే ఈ ఏడాది గుజరాత్‌లో వేరుశనగ పంట ఉత్పత్తి తగ్గినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో క్వింటాళ్‌కు రూ.7,400 నుంచి రూ.8,400 వర ధర పలుకుతోంది.