ప్రారంభమైన టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్
– తాండూరులో బారులు తీరిన ఉపాధ్యాయులు
– ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగం
– పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్న అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవులకు పోలింగ్ జరుగున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి తాండూరు నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాండూరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ, యాలాల మండలంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్, బషీరాబాద్ మండలంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్, పెద్దేముల్ మండలంలో జెడ్పీహెచ్ఎస్ స్కూళ్లను పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 438, యాలాలో 81, పెద్దేముల్ లో 23, బషీరాబాద్ మండలంలో 30 మంది ఓటర్లు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సోమవారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉపాధ్యాయులు బారులు తీరారు. వరుసగా కేంద్రంలోకి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు పోలింగ్ సరళిని తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు శాఖ 144 సెక్షన్, బందోబస్తు ఉండడంతో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.

