ఓటెత్తిన ఉపాధ్యాయులు..!
– వికారాబాద్ జిల్లాలో 94శాతం పోలింగ్
– మూడు పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం
– ప్రశాతంగా ముగిసిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని ఉపాద్యాయులు ఓటెత్తారు. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లాలో ప్రశాతంగా ముగిశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో 94.76 శాతం నమోదు అయ్యిందని అధికారులు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో 18 పోలింగ్ కేంద్రాలలో ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపాధ్యాయులు బారులు తీరి ఓటు వేశారు. ఉదయం మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమంగా పుంజుకుంది. సాయంత్రం వరకు దాదాపు అన్ని కేంద్రాల్లో 90 శాతంపైగా పోలింగ్ నమోదు అయ్యింది. జిల్లాలోని బొంరాస్ పేట్, పెద్దేముల్, దోమ లోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో 100 శాతం పోలింగ్ నమోదు కాగా.. బంట్వారంలో అతి తక్కువగా 87.5శాతం పోలింగ్ నమోదయ్యింది. పోలింగ్ కేంద్రాల వారిగా కోడంగల్‌లో 95, బొంరాస్ పేట్‌లో 100, దౌల్తాబాద్‌లో 88.89, తాండూరు పట్టణంలో 94.98, యాలాలలో 90.32, బషీరాబాద్‌లో 96.67, పెద్దేముల్‌లో 100, బంట్వారంలో 87.5, వికారాబాద్‌లో 90.91, వికారాబాద్-2లో 94.61, ధారూర్‌లో 96.55, మర్పల్లిలో 95.24, పూడూరులో 94.64, నవాబ్‌పేట్‌లో 96, మోమిన్ పేట్‌లో 98.28, కుల్కచర్లలో 96.7, దోమలో 100, పరిగిలో 97.44 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 1890 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా 1791 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ 94.76 శాతం నమోదయ్యింది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వికారాబాద్‌లో పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, తాండూరులో ఆర్డీఓ అశోక్ కుమార్‌ను సందర్శించారు. పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించారు. దీంతో టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. మిగతా శాతం ఉపాధ్యాయులు ఓటింగ్‌కు దూరంగా ఉండడం విమర్శలకు దారి తీసింది. ఓటు హక్కుపై అవగాహన కల్పించే బాధ్యత ఉన్న పంతుల్లే ఓటుకు హక్కుకు దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది.

