కార్పోరేషన్ రుణాలతో ఆర్థిక ప్రగతి
– మైనార్టీ అర్హులందరు సద్వినియోగం చేసుకోవాలి
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– జేఐసి క్యాంపులో లక్కీడ్రాలో లబ్దిదారుల ఎంపిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం కార్పోరేషన్ల ద్వారా అందించే రుణాలతో అర్హులు ఆర్థికాభివృద్ధి సాధించాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న సరిమళ్ అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మైనార్టీ కార్పోరేషన్ కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులను ఎంపిక చేసేందుకు మున్సిపల్ జేఐసి క్యాంపు నిర్వహించారు. మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై లబ్దిదారులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పోరేషన్ రుణాల కోసం 1160 మంది దరఖాస్తులు చేసుకుంటే లక్కీ డ్రా ద్వారా ప్రభుత్వ నిబంధనల మేరకు దాదాపు 50 మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. అందులో అర్హులై ఉండి రుణాలు రాని లబ్దిదారులకు మళ్లీ రుణాలు అందించేలా తమవంతు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వానికి నివేధిక అందించి, మైనార్టీల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామన్నారు. అదేవిధంగా రుణాలకు ఎంపికైన లబ్దిదారులు కార్పోరేషన్ రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, అబ్దుల్ రజాక్, బోయరవి, రాము, బొంబీనా, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, ఎంఐఎం పట్టణ అధ్యక్షులు హాది, మెప్మా డీఎంసీ రవికుమార్, తాండూరు టీఎంసీ సరిత, ఆర్పీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


