కులం పేరుతో దూషించిన సర్పంచ్ భర్తను అరెస్టు చేయాలి
– అట్రాసిటీ కేసు పెట్టాలని ప్రజా సంఘాల డిమాండ్
తాండూరు, దర్శని ప్రతినిధి: దళిత జాతిని అవమానపరిచిన యాలాల మండలం నాగసముందర్ గ్రామానికి చెందిన సర్పంచ్ భర్తను వెంటనే అరెస్టు చేయాలని సీఐటీయూ, కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సీఐటీయూజిల్లా అధ్యక్షులు కే. శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గ ప్పలు మాట్లాడుతూ యాలాల మండల కేంద్రంలో నాగ సముందర్ గ్రామానికి చెందిన మాల నరసింహులను అదే గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త భీమప్ప కులం పేరుతో దూషించాడని ఆరోపించారు. భార్య అధికారాన్ని అడ్డు పెట్టుకొని దళితులపై అరాచకాలకు పాల్పడుతున్నాడని అన్నారు. దళితులను అవమానపరిచిన సర్పంచ్ భర్త భీమప్ప పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ బషీరాబాద్ మండల అధ్యక్షులు సురేష్, బాధితులు మాల నరసింహులు, వెంకటేష్ మైసప్ప తదితరులు పాల్గొన్నారు.


