పాపం గుడ్డివాడు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పాపం గుడ్డివాడు..!
– మురుగు కాలువలో పడి గాయాలు
– కాపాడిన స్థానికులు, చికిత్స చేయించి ఇంటికి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పొట్టకూటి కోసం యాచించుకునే ఓ గుడ్డి వాడు నిర్మాణంలో ఉన్న మురుగు కాలువ గుంతలో పడిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం తాండూరు పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాండూరు మండలం జినుగుర్తి గ్రామానికి చెందిన ఈ వ్యక్తికి కంటిచూపు లేదు. భార్య గతంలో చనిపోయినట్లు తెలిసింది.

తన కూతురుతో కలిసి తాండూరు పట్టణంకు వచ్చి యాచిస్తుంటాడు. ప్రతి శుక్రవారం ఇందిరా చౌరస్తా – విలియం మూన్ రోడ్డు మార్గంలోని రాయల్ కాంటా సమీపంలోని నూర్ ఉలూమ్ దర్గా వద్దకు వచ్చి యాచిస్తుంటాడు. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం రాయల్ కాంటా సమీపంలో నిలబడి ఉన్నాడు. అయితే ఇటీవల విలియం మూన్ రోడ్డు నుంచి రాయల్ కాంటా వరకు డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతున్నారు.

ఇది గమనించని ఈ గుడ్డివాడు ప్రమాద వశాత్తు మురుగు కాలువ నిర్మాణ గుంతలో పడిపోయాడు. లోపల ఉన్న రాళ్లు, రప్పలు తగిలి స్వల్పగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గుంతలోకి దిగి కర్రల సాయంతో అతన్ని బయటకు తీశారు. అనంతరం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి.. చికిత్స చేయించిన అనంతరం అన్ని ఆటోలో జినుగుర్తికి పంపించారు.

ఇదికూడా చదవండి…

చలో.. ఎల్బీ స్టేడియం..!