సీతారాములకు జేజేలు..!

తెలంగాణ

సీతారాములకు జేజేలు..!
– కమణీయంగా కళ్యాణోత్సవాలు
– దేవాలయాలలో నవమి శోభ
– సందడి చేసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : మదినిండుగా భక్తులందరు సీతారాములకు జేజేలు పలికారు. తాండూరు నియోజకవర్గంతో పాటు తాండూరు పట్టణమంతా శ్రీ సీతా రామ నామ స్మరణతో మార్మోగింది. గురువారం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ దేవాలయాల్లో సీతారాముల కళ్యాణోత్సవాలు వైభోగంగా జరిగాయి,

పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఇందిరానగర్ లోని రాంమందిర్, సీతారాంపేట్ హనుమాన్ దేవాలయం, కన్యా పాఠశాల, సాయిపూర్ హనుమాన్ దేవాలయం, మల్రెడ్డిపల్లి ఆంజనేయ స్వామి దేవాలయాలలో ఆయా దేవాలయాల చైర్మన్లు, ఆలయ కమిటి సభ్యులు, సంఘాల సభ్యులు శ్రీరామ నవమిని ఘనంగా జరిపించారు.

అదేవిధంగా దేవాలయాలతో పాటు వివిధ కాలనీలలో సంఘాల ఆద్వర్యంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవాలను సుమూహూర్తములో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. నీలమేఘశ్యాముడు జనకుని కూతురు సీతమ్మ మెడలో మాంగళ్యదారణ చేస్తుండగా తరలివచ్చిన అశేష భక్తజనవాహిని తన్మమయంతో పులకించి జయ జయ ధ్వానాలు చేశారు.

సందడి చేసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
శ్రీరామ నవమి సందర్భంగా తాండూరు పట్టణంలో ఇందిరానగర్, సీసీఐ కాలనీ, సీతారం పేట్ హనుమాన్ దేవాలయాలతో పాటు యాలాల మండలం జుంటుపల్లిలో నిర్వహించిన వేడుకలలో ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు సందడి చేశారు. ఆయా దేవాలయాలు, ప్రాంతాలలో సీతారాములను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, నాయకులు శ్రీనివాస్ చారి, పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్ మంకాల రాఘ వేందర్, మాజీ కౌన్సిలర్ ఎం. శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్సీ వెంట బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, పట్లోళ్ల సాయిపూర్ బాల్ రెడ్డి, రవీందర్, మాజీ కౌన్సిలర్ పరిమళ రవీందర్, కౌన్సిలర్లు, యువకులు తదితరులు ఉన్నారు. మరోవైపు పట్టణంలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పాల్గొన్నారు.