వ్యాపారులకు గుడ్ న్యూస్..!

జాతీయం తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

వ్యాపారులకు గుడ్ న్యూస్..!
– ఇక 24 గంటల బిజినెస్‌ చేసుకోవచ్చు
– కొత్త విధానం అమల్లోకి తెచ్చిన సర్కారు
– కొన్ని షరతులతో ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని బడా వ్యాపారులకు, సామాన్య వ్యాపారులకు సర్కారు గుడ్‌ న్యూస్ చెప్పింది. ఇక నుంచి 24 గంటలు వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణికుముదిని జీవో నెంబర్ 4 పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని షరతులతో కూడిన ప్రకటను అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఉన్న తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్(1988)లోని సెక్షన్ 7‌లో పలు సవరణలు చేసినట్లు వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం.. 24 షాపింగ్ చేసుకోవాలంటే.. సదరు యజమానులు సంవత్సరానికి రూ. 10 వేల చొప్పున అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

దీని ప్రకారం లైసెన్స్ తీసుకున్న దుకాణాలు ఇకపై 24 గంటలూ తెరిచి ఉంచి, వ్యాపారాలు సాగించుకోవచ్చునని సూచించింది. అయితే, ఈ మేరకు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దుకాణాలు 24 గంటలు తెరిచి ఉండాలంటే పోలీసు యాక్టులోని నిబంధనలు పాటించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఆ దుకాణం యాజమాన్యం క్రమం తప్పకుండా రికార్డులను సమర్పించాలి. అదేవిధంగా దుకాణంలో పనిచేసే ప్రతి కార్మికుడు/ఉద్యోగికి గుర్తింపు కార్డు తప్పనిసరిగా మంజూరు చేయాలి. దుకాణాల్లో పనిచేసే మహిళలకు తగిన భద్రత కల్పించాలి. రాత్రి షిప్టులో పనిచేసే మహిళా సిబ్బంది నుంచి విధిగా సమ్మతిని రాతపూర్వకంగా తీసుకోవాలి. సిబ్బందికి వీక్లీ ఆఫ్ విధానాన్ని అమలుచేయాలి. ప్రభుత్వ సెలవుదినాలు, జాతీయ సెలవులు, వీక్లీ ఆఫ్ రోజు పనిచేస్తే దానికి బదులుగా మరో రోజున సీ-ఆఫ్ తీసుకునే వెసులుబాటు సిబ్బందికి ఉండాలి. రాత్రి షిప్టుల్లో పనిచేసే మహిళా సిబ్బందికి రానుపోను సౌకర్యాన్ని దుకాణం యాజమాన్యం కల్పించాలి. ప్రతీ వారం సిబ్బందికి నిర్దిష్టంగా పని గంటలను నిర్ణయించాలి. అంతకంటే ఎక్కువసేపు పని చేస్తున్నట్లయితే ఓవర్ టైమ్ వేతనాన్ని చెల్లించాలి.