బతికున్నా.. చచ్చిన శవంలా…!

జాతీయం తెలంగాణ హైదరాబాద్

బతికున్నా.. చచ్చిన శవంలా…!
– అంతిమయాత్రతో ఊరంతా ఊరేగింపు
– పిచ్చి భక్తుడి విచిత్ర మొక్కు
– సోషల్ మీడియాలో వైరల్
దర్శిని డెస్క్‌: బతికి ఉండగానే చనిపోయాకా ఏమేం చేస్తారో అన్ని చేయించుకున్నాడు. చచ్చిన శవంలా మారి అంతిమయాత్రలో ఊరేగాడు. ఓ పిచ్చి భక్తుడి విచిత్ర మొక్కు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో విచిత్ర మొక్కులు ఎన్నో చూసుంటారు … వినుంటారు… కానీ ఇప్పుడు చెప్పబోయే మొక్కు చాలా డిఫరెంట్. సేలం జిల్లాలోని కొండలంపట్టుకి చెందిన జయమణి స్థానికంగా చిన్న, చిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. తమ ప్రాంతానికి సమీపంలో ఉన్న మారియమ్మన్ ఆలయంలో అమ్మవారిని ఎప్పుడు పూజిస్తూ ఉంటాడు. తను కోరుకున్న ప్రతిదీ నెరవేరడంతో ఈసారి అమ్మవారికి ఒక విచిత్ర మొక్కు మొక్కుకున్నాడు.

జయమణి అమ్మవారికి మొక్కుకున్న మొక్కు ఏంటంటే బ్రతికుండగానే అతనికి అంతిమ యాత్ర నిర్వహించడం. దాన్ని కుటుంబసభ్యులు ముందు వ్యతిరేకించినా.. జయమణి పట్టుబట్టడంతో తరువాత ఒప్పుకున్నారు. అతడు కోరినట్లగానే ఇంటి ముందు చనిపోయినట్టు ఫ్రీజర్ బాక్స్‌లో అతడిని ఉంచి, ఊరంతా సంతాప పోస్టర్లు వేయించి, బంధువులందరికి సమాచారమిచ్చి , పాడే కట్టి ఊరంతా శవాన్ని ఊరేగించినట్టు ఊరేగించి.. స్మశానంలో వదిలిపెట్టి వచ్చారు కుటుంబసభ్యులు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చచ్చిన శవంలా శరీరంలో కదలిక లేకుండా ఉండి.. ఊరంతా జరిగిన తన అంతిమ యాత్రను చూసుకున్నాడు జయమణి. ఇదేం మొక్కు సామి అని కొందరు పెదవి విరవగా.. మరికొందరు ఇది వెర్రితనం అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఈ వార్త ఇప్పుడు సేలం జిల్లాలో ట్రెండింగ్‌గా మారింది.