నేడు, రేపు, ఎల్లుండి వర్షాలు..!
– ప్రకటించిన వాతావరణ శాఖ
– ప్రజలు అప్రమత్తండాలని సూచన
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో నేడు, రేపు, ఎల్లుండి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని రాష్ట్ర వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. సోమవారం నైరుతి ఆవర్తనం, దాని పరిసరాల్లోని ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోందని వెల్లడించింది. మంగళవారం నిజామాబాద్ జిల్లా, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూలు, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపింది.
బుధవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో, గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడకక్కడ వర్షాలు పడే అవకాశముందని వివరించింది. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణం చేయాలని, పనులు చేసుకోవాలని పేర్కొంది.
ఇది కూడా చదవండి…


