కమలం టిక్కెట్టు ఎవ్వరికో..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కమలం టిక్కెట్టు ఎవ్వరికో..!
– తెరపైకి కోండా విశ్వేశ్వర్ రెడ్డి పేరు
– రేసులో నేనున్నాంటున్న లక్ష్మారెడ్డి
– వారిద్దరి తరువాత బరిలో మరోనేతకు చాన్స్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదును పెడు తోంది. వికారాబాద్‌ జిల్లాలో ఈ సారి పాగా వేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే తాండూరు నియోజకవర్గ అసెంబ్లీ స్థానంపైనే అందరి దృష్టి పడింది. ఎందుకంటే తాండూరు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అభ్యర్థుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో పార్టీ టిక్కెట్టు ఎవరికి వరిస్తోందో అనే కలవరం అభ్యర్థులతో పాటు పార్టీ కార్యకర్తల్లో కలవరం పెడుతోంది. తెలంగాణ ఉద్యమ కారుడుగా, జేఏసీ నాయకుడుగా ఉన్న యు.రమేష్‌ కుమార్ గత అసెంబ్లీ కంటే ముందు బీజేపీ పార్టీలో చేరి క్రీయాశీలక రాజకీయాల్లో వచ్చారు. తాండూరు అసెంబ్లీ పీఠంపై గురి వేసి పార్టీకోసం పనిచేశారు. ఆ సారి ఎమ్మెల్యే టిక్కెట్టు యు.రమేష్‌ కుమార్‌కే అని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా పటేల్ రవిశంకర్ పార్టీ టిక్కెట్టు దక్కించుకున్నారు.

దీంతో రమేష్‌ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తరువాత మళ్లీ బీజేపీలో చేరారు. దీంతో మళ్లీ యు.రమేష్‌ కుమార్‌ పేరే ఎమ్మెల్యే అభ్యర్థిగా వినిపించింది. కొన్నాళ్ల తరువాత తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అనుచరుడు, వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా ఉన్న మురళీ కృష్ణ గౌడ్ ఎమ్మెల్యేతో విభేధాలు రావడంతో బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. తాండూరు నియోజకవర్గంలో కలకలం రేపిన శివస్వాముల సంఘటన, మురళీగౌడ్ ఇంటిపై దాడి సంఘటనలతో పార్టీలో ఆయన గ్రాఫ్‌ అమాంతం పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే బరిలో మురళీకృష్ణ గౌడ్ ఉన్నారంటూ ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ఎన్నికల గడువు సమీస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ వర్గంలో ఉన్న డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి అనూహ్యంగా బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. పార్టీలో చేరాలంటే బీజేపీ ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వాలని కండిషన్ పెట్టినట్లు ప్రచారం జరిగగింది. దీనిపై పార్టీ పెద్దలు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా టిక్కెట్టు వస్తుందనే ధీమాలో లక్ష్మారెడ్డి బీజేపీలో చేరారు. ఈ సారి ఎన్నికల బరిలో తాను ఉంటున్నానని లక్ష్మారెడ్డి ప్రకటించుకున్నారు. రైతుల అభివృద్ధికి తన వంతు కృషి చేశానని, రైతుల మద్దతకు తనకే ఉంటుందని రైతు నినాదాన్ని ప్రయోగిస్తున్నారు.

ఇలా రోజు రోజుకు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు తెరపైకి రావడంతో చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించారని ప్రచారం జరిగింది. అయితే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాండూరుపై అంతగా శ్రద్దచూపడం లేదని వినిపిస్తోంది. దీంతో బీజేపీలో మొదటి ప్రాధాన్యత కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత లక్ష్మారెడ్డి పేరు బలంగా వినిపిస్తున్నప్పటికి వారిద్దరు లేకుంటే మురళీకృష్ణ గౌడ్‌ పోటీ ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ టిక్కెట్టు ఎవ్వరికి వస్తుందో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!