పోయిన ఫోన్ రికవరీ..!
– గుర్తించి అప్పగించిన పోలీసులు
– కృతజ్ఞతలు తెలిపిన యువకుడు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : బైకుపై వెళుతున్న ఓ యువకుడు మార్గమద్యలో సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. పోయిన ఫోన్ కోసం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రికవరీ చేసి తిరిగి అప్పగించారు. ఈ సంఘటన తాండూరు రూరల్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామానికి చెందిన ఎరుకలి పండరి గత నెల జులై 23న ఉదయం తాండూరుకు బైకుపై వస్తుండగా అతని ఫోన్ వీవో – ఏ-23 సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. ఎంత వెతికినా ఫలితం దక్కలేదు. దీంతో కరణ్ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సీఈఐఆర్ ద్వారా ఫోన్ ను గుర్తించారు. రికవరీ చేసిన ఫోన్ను సోమవారం తాండూరు రూరల్ సీఐ రాంబాబు చేతుల మీదుగా యువకుడు పండరికి తిరిగి అప్పగించారు. ఇందుకు యువకుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా రూరల్ సీఐ రాంబాబు, ఎస్ఐ మధుసూధన్ రెడ్డిలు మాట్లాడుతూ ఎవరైనా మోబైల్ ఫోన్లు పోగొట్టుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఉన్నారు.
ఇది కూడా చదవండి…

