గళమెత్తిన కలం వీరులు..!
– జర్నలిస్టుల సంక్షేమ నిధిని పెంచాలి
– మీడియా రక్షణ చట్టం అమలు చేయాలి
– హెల్త్ కార్డులు అమలు చేసి, రైల్వే పాసులు పునరుద్ధరించాలి
– తాండూరులో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషికి తీర్మానం
– టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి
– మహాత్మ గాంధీకి వినతిపత్రం అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరంతరం పనిచేసే జర్నలిస్టులు తమ సమస్యల పరిష్కారానికి గళమెత్తారు. తాండూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ యూనియన్ నేతలు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమ నిధిని పెంచాలని డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే ఐజేయూ తాండూరు డివిజన్ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి డి. రామకృష్ణల ఆధ్వర్యంలో పట్టణంలోని చైతన్య జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి, సినీయర్ జర్నలిస్టు భీంసేన్ రావు, క్రమశిక్షణ సంఘం సభ్యులు వెంకటేశం(వాసు)లు హాజరయ్యారు. ఈ సమావేశంలో జర్నలిస్టులకు సంక్షేమ నిధి ఏర్పాటు. అర్హులైన విలేకరులకు ఇండ్ల స్థలాలు. హెల్త్ కార్డులు, రైల్వే పాసుల పునరుద్ధరణ అంశాలపై చర్చించారు. అనంతరం శాంతియుతంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి, ఇందిరా చౌరస్తా, నెహ్రు గంజ్ మీదుగా గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది.

అనంతరం జిల్లా అధ్యక్షులతో పాటు యూనియన్ నేతలు మహాత్మ గాంధీకి నివాళులు అర్పించి వినతిపత్రం అందజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ సమాజం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు సంక్షేమ నిధిని రూ.100 కోట్లకు ఉన్న దానిని రూ.1000 కోట్లకు పెంచాలన్నారు. ఈ విషయంలో స్థానిక సమాచార మంత్రి మహేందర్ రెడ్డి చొరవ చూపాలన్నారు. అంతేకాకుండా అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు అమలు చేయాలన్నారు. రైల్వే పాసులను పునరుద్ధరించాలన్నారు. దీనిపై ఎంపీ రంజిత్ రెడ్డి పార్లమెంట్లో ప్రస్తావించాలన్నారు.
అదేవిధంగా జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని, గతంలో ఉన్న దాడుల కమిటిని పునురుద్దరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేసి న్యాయం చేయాలన్నారు. అదేవిధంగా మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు ప్రత్యేక దృష్టితో తాండూరులో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలన్నారు. జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు దృష్టిసారించాలన్నారు.
తాండూరు డివిజన్ జర్నలిస్టు నిధికి తీర్మానం
అంతకుముందు చైతన్య కళాశాలలో జరిగిన సమావేశంలో తాండూరు డివిజన్ జర్నలిస్టు యూనియన్ సంక్షేమ నిధి ఏర్పాటుకు తీర్మానించారు. అత్యవసర సమయంలో ఆపదలో ఉన్న విలేకరులను ఆదుకునేందుకు తోడ్పడుతుందన్నారు. జర్నలిస్టు నిధికి తనవంతుగా రూ.11 వేల విరాళం అందిస్తున్నట్లు డివిజన్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి ప్రకటించారు. మిగతా జర్నలిస్టులు కూడా తోచిన విరాళాన్ని నిధికి అందజేయాలన్నారు.
త్వరలోనే విధి విధానాల అమలుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే తాండూరు పట్టణ అధ్యక్షులు మఠం నిరంజన్ స్వామి, ప్రధాన కార్యదర్శి మహేష్, తాండూరు మండల అధ్యక్షులు సంగమేశ్వర్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, వెంకట్రామ్ రెడ్డి, రాంరెడ్డి, బషీరాబాద్ మండల ప్రధాన కార్యదర్శి సైదప్ప, యాలాల మండల అధ్యక్షులు రాఘవేంద్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి నర్సింలు, జర్నలిస్టులు శాంతుకుమార్, నర్సింలు, శ్రీనివాస్ రెడ్డి, గౌస్, వడ్డె శ్రీనివాస్, శ్రీనివాస్, శ్రీకాంత్, గోపాల్, దీపక్, నవీన్, రమేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

