తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..!
– కేసీఆర్ ఫ్యామీలీ ఫాంహౌస్‌కే పరిమితం
– కర్ణాటకలో గ్యారెంటీలను అమలు చేస్తున్నాం
– అనుమానం ఉంటే తెల్చుకునేందరు రండి
– కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సవాల్
– కేసీఆర్ చేసిన అవినీతిని కక్కిస్తాం
– బస్సుయాత్రలో టీపీసీసీ రేవంత్ రెడ్డి
– మంత్రిపై ఒకలా, ఎమ్మెల్యేపై మరోలా వాఖ్యలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చి తీరుతుందని కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పట్ల, అధినేత్రి సోనియా గాంధీ పట్ల ప్రజలు కృతజ్ఞత చూపాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత విజయభేరి బస్సు యాత్ర శనివారం సాయంత్రం వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి ప్రారంభమైంది.
యాత్రలో పాల్గొన్నకర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో డీకే శివకుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని అందించారని గుర్తుచేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పట్ల కృతజ్ఞత చూపాలన్నారు. కాంగ్రెస్ ఏదైనా హామీ ఇచ్చింది అంటే.. తప్పక నెరవేరుస్తుందన్నారు.

తెలంగాణలో పదేళ్లయినా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామిలను నెరవేర్చారా అని ప్రశ్నించారు. కర్ణాటకలో ఇచ్చిన ఐదు గ్యారెంటీలను కాంగ్రెస్ అమలు చేస్తోందన్నారు. అనుమానం ఉంటే సీఎం కేసీఆర్ కర్ణాటకకు వచ్చి చూసుకోవాలని సవాల్ విసిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదల గురించి ఆలోచిస్తుందన్నారు. కర్ణాటకలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గృహలక్ష్మి పథకం ద్వారా 1.10కోట్ల మంది మహిళలకు నెలకు రూ.2వేలు ఇస్తున్నామన్నారు. పేదలకు 10కిలోల సన్నబియ్యంతో పాటు మహిళలందరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నామన్నారు. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీ పథకాలు మహాలక్ష్మా, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూతను రేవంత్ రెడ్డి సీఎం అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి అమలు చేస్తామన్నారు. డిసెంబరు 9న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ అవినీతిని కక్కిస్తాం : రేవంత్ రెడ్డి
దేశాన్ని ఏలుతానని కేసీఆర్ కలలగంటున్న సీఎం కేసీఆర్ పని తెలంగాణలో అయిపోయిందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల అచ్చంపేటలో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోతే రెస్టు తీసుకుంటానని పేర్కొనడం ఈ ఎన్నికల్లో ఆయన ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్లే అని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా సరే ఈ ఏండ్లు చేసిన కోట్ల అవినీతీ, భూ కభ్జాలను కక్కించి తీరుతామన్నారు. తెలంగాణలో ఎక్కడా రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడంలేదుని, కేవలం 8..9 గంటలు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌కు ఔటర్ రింగురోడ్డు, మెట్రో రైలు తెచ్చింది, మత సామరస్యాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీనే స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రాజెక్టుల వల్లే హైదరాబాద్ ఖ్యాతి పెరిగింది. లంచాలు ఇవ్వని స్థిరాస్తి వ్యాపారులను అణిచివేస్తున్నారని విమర్శించారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 12 శాతం ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం.. మైనార్టీలను మోసం చేసింది. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందే’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
మంత్రిపై ఒకలా, ఎమ్మెల్యేపై మరోలా వాఖ్యలు
బస్సుయాత్రలో ప్రసంగించిన టీపీసీసీ రేవంత్ రెడ్డి వాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాండూరులో గతంలో మంత్రిగా పనిచేసిన నేత ఈ ప్రాంతానికి కొంత మంచి చేశారని అన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేపై మరోలా వాఖ్యలు చేశారు. స్వార్థం కోసం రూ. 100 కోట్లకు అమ్ముడు పోయే వ్యక్తికి టిక్కెట్ కేటాయించారని అన్నారు. తాండూరులో అభివృద్ధి చేయకుండా కబ్జాలకు, కాగ్నాలో ఇసుక దోపిడిలకు పాల్పడ్డారని అన్నారు. అంతేకాకుండా టిక్కెట్ కేటాయింపుకు ముందు మంత్రి వర్గం, ఎమ్మెల్యే వర్గం నేతలు కొట్లాలు చేసుకున్నారు. తీరా టిక్కెట్ పంచాయతీ తేలిన తరువాత ఒకరు కడుపులో దాచుకుంటే.. మరోకరు కాళ్లమీద పడి ఒక్కటయ్యారని అన్నారు. నమ్ముకున్న కార్యకర్తలను నడి చౌరస్తాలో అనాథలను చేశారని అన్నారు. కార్యకర్తలకు అండగా ఉండేందుకు నమ్మకమైన మనోహర్ రెడ్డిని తాండూరు అభ్యర్థిగా తీసుకరావడం జరిగిందని, ఆయనను, కోడంగల్ స్థానాన్ని గెలిపించుకుని కాంగ్రెస్ పార్టీ పౌరుషాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు.
పార్టీ మారే ప్రసక్తే లేదు : మనోహర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే అవినీతి లేకుండా పనిచేస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. కొందరు ఎమ్మెల్యేగా గెలిస్తే పార్టీ మారుతారని ప్రచారం చేస్తున్నారని గుర్తుచేస్తూ తనను గెలిపిస్తే పార్టీ మారే ప్రసక్తే లేదని ప్రమాణం చేస్తున్నా అని తెలిపారు. పార్టీ మారితే తల నరుక్కుంటా అని అన్నారు. ఎమ్మెలె ్యగా గెలిస్తే రేవంత్ రెడ్డి సహాకారంతో తాండూరులో బీఈడీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ శివసాగర్ ప్రాజెక్టు తదితర పనులను పూర్తి చేస్తామన్నారు.

పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, మాజీ డీసీసీబీ చైర్మన్
మరోవైపు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ మంత్రి పుష్పలత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాపింగ్, డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, కల్వ సూజాత, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితా సంపత్, మహిళ అధ్యక్షురాలు శోభారాణి, వివిధ మండలాల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

