కాంగ్రెస్ కదనోత్సాహాం..!
– అట్టహాసంగా నామినేషన్ ర్యాలీ
– కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా
-ప్రజలకు అభివాదం చేసిన మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో కాంగ్రెస్ పార్టీ కదనోత్సాహాన్ని ప్రదర్శించింది. తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా శుక్రవారం తాండూరు పట్టణంలో అట్టహాసంగా ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీలో అభ్యర్థి మనోహర్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహరాజ్, ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. ప్రత్యేక వాహనంపై నుంచి ప్రజలకు, ఓటర్లు అభివాదం చేశారు.
అక్కడి నుంచి ర్యాలీ ఇందిరా చౌరస్తా, వినాయక్ చౌక్, శాంత్ మహల్ చౌరస్తా, భద్రేశ్వర చౌరస్తా, గాంధీ చౌక్, మర్రి చెట్టు కూడలి మీదుగా కొనసాగింది. ఈ ర్యాలీలోని తాండూరు నియోజకవర్గంలోని వివిధ మండలాలు, తాండూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి జై కొడుతూ నినాదాలు చేశారు. కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పురవీధుల్లో కాంగ్రెస్ ర్యాలీ కదనోత్సాహాన్ని తలపించింది. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే పేదల సంక్షేమం సాధ్యపడుతోందన్నారు. ప్రజలందరు ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకుంటున్నారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అన్నారు. బీఆర్ఎస్ అరాచక పాలనకు గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆర్బీఎల్ శ్రీనివాస్ రెడ్డి, అధికార ప్రతినిధి కల్వ సూజాత, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితా సంపత్, నాయకులు అబ్దుల్ రవూఫ్, పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, బంటుమల్లప్ప, మాజీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, మసూద్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, వివిధ మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

